Dhulipalla Narendra: నేరప్రవర్తన ఉన్నవారిని ప్రోత్సహిస్తున్న జగన్.. ధూళిపాళ్ల ఫైర్
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:27 PM
జగన్ తన హయాంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నడిపారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. మహిళలు ఓట్లు వేయలేదని, ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా కల్పించలేదనే అక్కసుతోనే జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) పొన్నూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వల్లే బెట్టింగ్‌లో పాల్గొని కోట్లాది రూపాయలు కోల్పోయిన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుని చనిపోతే తమ ప్రభుత్వానికి సంబంధమెంటనీ ప్రశ్నించారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వ వేధింపులు ఎలా కారణమవుతాయని నిలదీశారు. సత్తెనపల్లి పర్యటన దేనికోసమో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. నటనలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజల మీద ఇంకా దండయాత్ర చేస్తూనే ఉన్నారని విమర్శించారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
జగన్ తెరలేపిన రాజకీయ శవయాత్రకు తొలి ముద్దాయి ఆయనే అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్, జగన్ అసత్యాలు ప్రేరేపించటం వల్లే నాగమల్లేశ్వరరావు కోట్లాది రూపాయలు బెట్టింగ్‌కు పాల్పడ్డారని చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓట్లు వేయలేదనే అక్కసు, కోపం ప్రజలపై జగన్ వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఇకనైనా తన పద్ధతి మార్చుకోకుంటే తాము ఇంకా నష్టపోతామని వైసీపీ నేతలు గ్రహించాలని అన్నారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కూటమి ప్రభుత్వం ఆసాంఘిక శక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని కోరారు. వైసీపీని ప్రజలు 11సీట్లకే పరిమితం చేసినా జగన్ తన అరాచకత్వం ఇంకా వీడటం లేదని మండిపడ్డారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
మహిళలు ఓట్లు వేయలేదని, ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా కల్పించలేదనే అక్కసుతోనే జగన్ వ్యవహరిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. నేరప్రవర్తన ఉన్నవారిని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ తన హయాంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నడిపారని ఆరోపించారు. జగన్ తన తీరుని ప్రశ్నించినా, పోరాడినా, విభేదించినా అక్రమ కేసులు బనాయించటంతో పాటు ప్రాణాలు హరించేలా వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిన జగన్ కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవటం దేనికి నిదర్శనమని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News