Kuppam Incident: మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:48 AM
Kuppam Incident: అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.
చిత్తూరు, జూన్ 17: అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా సీరియస్ అయ్యారు. తాజాగా ఈ దారుణ ఘటనపై బాధితురాలు శిరీష స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తీర్చలేదని మహిళ అని చూడకుండా నడిరోడ్డుపై తాడుతో చెట్టుకు కట్టేశారంటూ శిరీష కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఇద్దరు ఆడ బిడ్డలు, ఒక మగ బిడ్డ ఉన్నారని తెలిపారు.
‘బెంగళూరు నుంచి నారాయణపురంలో నా బిడ్డ టీసీ కోసం గ్రామానికి వచ్చాను. టీసీ తీసుకుని పాఠశాల నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుండగా అప్పు ఇచ్చిన కన్నప్ప కుటుంబ సభ్యులు ఎదురుపడి రూ.80,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కఠినంగా వ్యవహరించారు’ అని తెలిపారు. పాఠశాల వద్ద నుంచి తనను లాక్కుని వచ్చి చెట్టుకు తాడుతో కట్టేశారన్నారు. అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదన్నారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు. కన్నప్ప కుటుంబ సభ్యుల దాడిలో తన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. తన కళ్ళ ఎదుటే బిడ్డలు అమ్మా అంటూ ఏడుస్తున్నా పక్కకు లాగి పారేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
దాదాపు గంటసేపు చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. ‘మా అమ్మ, నా ముగ్గురు బిడ్డలు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు’ అని తెలిపారు. ఎవరో ఒక పెద్దాయన బుల్లెట్‌పై వచ్చి మహిళను అలా చేయకూడదని చెప్పినా వినలేదన్నారు. కొంత మంది సహాయంతో కట్లు విప్పుకొని వచ్చేసినట్లు చెప్పారు. ఈ వీడియో ఎవరు తీశారో తనకు తెలియదని.. మొత్తం వైరల్ అయిందన్నారు. తన కట్లు విప్పేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని బాధితురాలు శిరీష చెప్పుకొచ్చారు.
శిరీషకు హోంమంత్రి వీడియో కాల్

విశాఖపట్నం: కుప్పం మండలం నారాయణపురం ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడి, ధైర్యం చెప్పారు హోంమంత్రి. మహిళ అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.
కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు కట్టాలంటూ శిరీష అనే మహిళను గ్రామానికి చెందిన మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేయడంతో పాటు దాడి చేశారు. ఈ ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. మహిళను చెట్టుకు కట్టేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
నేడు సిట్ ఎదుటకు పీసీసీ చీఫ్
Read Latest AP News And Telugu News