Share News

CM Chandrababu: కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

ABN , Publish Date - Jun 17 , 2025 | 10:31 AM

CM Chandrababu: కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిని కఠిన శిక్షించాలని ఆదేశించారు.

CM Chandrababu: కుప్పం ఘటనపై సీఎం  చంద్రబాబు సీరియస్
CM Chandrababu

అమరావతి, జూన్ 17: అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళను మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించారు. ఈ ఘటనపై ఈరోజు (మంగళవారం) ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడంతో ఈ విషయంపై జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ తెలియజేశారు.


మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని, వారి వివరాలను జిల్లా అధికారులకు అందజేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితులకు ఎందుకు అప్పులు అయ్యాయి అనే విషయాన్ని సేకరించి సీఎం పేషీకి పంపించాలని ఆదేశాలిచ్చారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌తోనూ సీఎం మాట్లాడి.. ఘటన వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.


కాగా.. కుప్పం మండలం నారాయణపురానికి చెందిన మునికన్నప్ప దగ్గర అదే గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప తన భార్య, పిల్లలను గ్రామంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక భార్య శిరీష కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. అయితే సకాలంలో అప్పు చెల్లించలేదని మహిళ పట్ల మునికన్నప్ప, అతని కుటుంబసభ్యులు దారుణంగా వ్యవహరించారు. మహిళను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. విషయం తెలిసిన పోలీసులు మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.


సాటి మహిళగా ఖండిస్తున్నా: వైఎస్ షర్మిల

sharmila.jpg

అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) అన్నారు. సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్య ఇది అంటూ వ్యాఖ్యలు చేశారు. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానమన్నారు. సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని.. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఈ రాష్ట్రాల్లో మందు'భామలే' ఎక్కువంట..

నేడు సిట్‌ ఎదుటకు పీసీసీ చీఫ్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 11:58 AM