Share News

Sharmila Phone Tap: సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:00 PM

Sharmila Phone Tap: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు తెలియ వచ్చింది.

Sharmila Phone Tap: సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
Sharmila Phone Tapping

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌కు గురైనట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. తాజాగా ఆ జాబితాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) కూడా ఉన్నట్లు తేలింది. జగన్ చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్‌ అయినట్లు బయటపడింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ అయినట్లు తేలింది. షర్మిల కోసం కోడ్ భాష ఉపయోగించినట్లు సమాచారం.


షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు సమాచారం. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించి ఓ సీనియర్ పోలీస్ అధికారి వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించారు. ఈ క్రమంలో తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు (బుధవారం) వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల స్పందిచనున్నట్లు సమాచారం.


ఇక.. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు రికార్డు చేశారు. అలాగే జడ్పీ చైర్‌పర్సన్ సరిత కూడా తన ఫోన్‌ ట్యాప్ అయ్యినట్లు తెలపడంతో ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెకు నోటీసులు పంపించే అవకాశం ఉంది. షర్మిలను కూడా సాక్షిగా పరిగణిస్తూ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


గతంలో షర్మిల తెలంగాణలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ ట్యాప్ జరగడం.. ఆమె కదలికలను అప్పటి ప్రభుత్వం ముందస్తుగానే తెలుసుకుని అరెస్ట్ చేయడం, అడ్డుకోవడం, హౌజ్ అరెస్ట్‌లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా షర్మిల ఏయే రాజకీయ నాయకుడితో మాట్లాడుతుందన్న విషయాలతో పాటు వ్యక్తిగత కాల్స్‌ను ట్యాప్ చేసి జగన్‌కు సమాచారం అందించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో షర్మిల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తే ఈ కేసులో మరికొన్ని కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉంది. అయితే షర్మిలను జూబ్లీహిల్స్‌ పోలీసులు సాక్షిగా పెట్టి స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 01:56 PM