Share News

CM Chandrababu: ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి

ABN , Publish Date - May 30 , 2025 | 05:40 PM

సంపద సృష్టి జరగాలి.. అది పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సంపద సృష్టి ద్వారానే ఆదాయం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

CM Chandrababu: ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి
CM Chandrababu Naidu

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఐఐ సదస్సులు (CII conference) నిర్వహించానని, తాను మొదటి నుంచీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చాయని పేర్కొన్నారు. దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని, అక్కడికి వెళ్లొద్దని కొందరు తనకు సూచించారని చంద్రబాబు తెలిపారు. అక్కడ ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు ఓట్లు వేయరని చెప్పారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధాని కూడా దావోస్‌ వెళ్లలేదని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


1995 నుంచి తాను మాత్రమే దావోస్‌‌కు తరచూ వెళ్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. సంపద సృష్టి జరగాలని, అది పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. సంపద సృష్టి ద్వారానే పేదల ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సీఐఐ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలపై ప్రసంగించారు. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని వెల్లడించారు. సరైన సమయంలో దేశానికి ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నారని ప్రశంసించారు. భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు. చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏడు రెట్లు ఎక్కువని వివరించారు సీఎం చంద్రబాబు.


సరైన పాలసీలు రూపొందిస్తే మన ప్రగతిని ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశానికి రానున్న పదేళ్లు అత్యంత కీలకమని అన్నారు. హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్‌కు లబ్ధి జరిగిందని స్పష్టం చేశారు. 2047 విజన్‌ లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగుతోందని వివరించారు. సాంకేతిక విప్లవంలో చాలా మార్పులు వచ్చాయని, ఏపీలో 15 శాతం వృద్ధి రేటు తన లక్ష్యమని వెల్లడించారు. అమరావతిలో దేశంలోనే తొలిసారి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నామని, విశాఖపట్నానికి టీసీఎస్, గూగుల్‌, మిట్టల్‌ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు సీఎం చంద్రబాబు.


ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోనే ఏపీలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులతో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఏపీలో పలు రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు. ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆయన ఆకాంక్షించారు. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను భారత్‌ సరిగా ఉపయోగించుకోవాలని.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, డ్రోన్లదే నేడు కీలకపాత్ర అని వివరించారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 30 , 2025 | 06:30 PM