Atchannaidu Slams YS Jagan: రైతులను ఐదేళ్లు పట్టించుకోలేదు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:45 PM
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) సమాధానం ఇచ్చారు. ఏపీలో ఎరువులు, యూరియా సమస్యలను అధిగమించామని తెలిపారు. యూరియాపై రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఇప్పటికే 6.90 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని స్పష్టం చేశారు. ఇంకా 97 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందని వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల్లో 70 శాతం యూరియా పంపిణీ చేస్తున్నామని వివరించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా రైతుల గురించి జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు మంత్రి అచ్చెన్నాయుడు.
డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి అవార్డు ఇచ్చిందని గుర్తుచేశారు. డ్రిప్, స్ప్రింక్లర్లు కావాలని కోరిన వారికి 24 గంటల్లోగా ఇస్తున్నామని తెలిపారు. అన్నదాతలు అనేక ప్రాంతాల్లో నానో యూరియా వాడి అధిక దిగుబడులు తెస్తున్నారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం వ్యవసాయశాఖను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయశాఖకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రూపాయి కూడా వాడలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పథకాలన్నీ వాడుకుంటున్నామని ఉద్ఘాటించారు. రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News