Satya Prasad Fires Jagan: జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించారు: అనగాని సత్యప్రసాద్
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:48 PM
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ (YSRCP) ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో పరిపాలన సౌలభ్యం ఉండేలా తాము చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. పరిపాలన సక్రమంగా జరిగేలా జిల్లాలు పునర్విభజనలో మార్పులు, చేర్పులు చేశామని స్పష్టం చేశారు. సోమవారం లేదా మంగళవారం మరోసారి సమావేశమై తుది నివేదిక సిద్ధం చేసి సీఎం చంద్రబాబుకి ఇస్తామని పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. సీఎం చంద్రబాబుతో నిన్న(మంగళవారం) మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలపై అధికారులతో మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
జిల్లాల విభజనతో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తాం: మంత్రి అనగాని
గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై ఈ సమావేశంలో చర్చించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాల విభజనతో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని నెరవేర్చే విధంగా GOM ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వాటితోపాటు GOMలో ఉన్న మంత్రులు ఇచ్చిన సూచనలను కూడా కూలంకుషంగా చర్చించామని పేర్కొన్నారు. మండలాలు, పంచాతీయలు విభజన చేయకుండా నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండాలని నిర్ణయించామని అన్నారు. మరోసారి ఈ విషయంపై సమావేశమై నివేదికను రూపొందించి సీఎంకు అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
రిజిస్ట్రేషన్లపై అసత్య ప్రచారం: మంత్రి నారాయణ

అమరావతి రైతులకు ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొందరూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ (Minister Narayana) ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని వివరించారు. ల్యాండ్ పూలింగ్ కింద 30,635 మంది రైతులకు 34,911.23 ఎకరాలు కేటాయించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ 2,727 మంది రైతులకు 3,188 ఎకరాల్లో ప్లాట్‌ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ.
పెండింగ్‌లో రిజిస్ట్రేషన్‌లు: మంత్రి నారాయణ
ఇంకా 991 మంది రైతులకు 719 ఎకరాలు మాత్రమే ప్లాట్‌లు కేటాయించాల్సి ఉందని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్‌లలో ఇంకా 2501 మందికి 8441 ప్లాట్‌లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని వివరించారు. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్‌లు మొత్తం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో 484 మంది రైతులకు 3.15 కోట్ల కౌలు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళానికి గురి చేయొద్దని కోరారు మంత్రి నారాయణ.
అధ్యయనం చేసి నివేదిక ఇస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణనకు ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణ నివేదిక ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వ్యాఖ్యానించారు. ఈ సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
Read Latest AP News And Telugu News