Share News

CM Chandrababu: చేనేత కార్మికుల భవితకు భరోసా.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:30 PM

ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. తనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల నుంచే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులు నేచే బట్టలపై జీఎస్టీ ఐదుశాతం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: చేనేత కార్మికుల భవితకు భరోసా.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):: భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు దశాబ్దాల క్రితమే ఖ్యాతిని తీసుకువచ్చింది మన చేనేత పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) అభివర్ణించారు. పొందూరు ఖద్దర్ వస్త్రాలను గాంధీజీ సైతం మెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి, చేనేత వర్గానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ఘాటించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవించే సంస్థ చేనేత అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా చేనేత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని నొక్కిచెప్పారు. రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశానని ప్రకటించారు సీఎం చంద్రబాబు.


50 ఏళ్లకే పెన్షన్..

చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిది తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. చిన్న వయస్సులోనే చేనేత కార్మికులు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఉందని.. అందుకే 50 ఏళ్లకే పెన్షన్‌ తీసుకువచ్చామని ప్రకటించారు. 50 శాతం పెట్టుబడితో మరమగ్గాలకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ఆప్కో ద్వారా కొనుగోళ్లు కూడా ఆపేశారని.. సబ్సిడీలు ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో చేనేత పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయిందని వాపోయారు. తమ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. తనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని చెప్పుకొచ్చారు. ఈ నెల నుంచే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులు నేచే బట్టలపై జీఎస్టీ ఐదుశాతం ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువేనని తెలిపారు. 5,386 మందికి రూ.5 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. 92,724 మందికి పెన్షన్లు ఇస్తున్నాం.. రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. నేతన్న భరోసా కింద అదనంగా రూ.25 వేలు ఇప్పించే బాధ్యత తమదని ఉద్ఘాటించారు. పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను అడ్వైజర్‌గా నియమించామని ప్రకటించారు. ఏదో చేయాలన్న తపన ఉన్నందునే సుచిత్ర ఎల్లాను నియమించామని స్పష్టం చేశారు. చేనేత కార్మికుడి నుంచి వినియోగదారుడి వరకు పద్ధతి ప్రకారం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.


ప్రత్యేక గుర్తింపు తెస్తాం..

‘ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చేనేతలకు ఎప్పుడూ అండగా ఉంటాం. జీఎస్టీని ఐదుశాతం తగించటం వల్ల 15 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రముఖ డిజైనర్లను సంప్రదించి వారితో చేనేతలకు మరింత అధునాతన పద్ధతిలో వస్త్రాలను తయారు చేయిస్తాం. ట్రైస్బలిటీ విధానంతో ప్రపంచం అంతా చేనేతకు ప్రత్యేక గుర్తింపు తెస్తాం. ఏపీలో వివిధ ప్రాంతంలో క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తాం. వెంకటగిరి, మంగళగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడల్లో 1374 మందికి పని దొరుకుతుంది. అమరావతిలో హ్యాండ్ లామ్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం. ఆదరణ 3తో మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తాం. ప్రొద్దుటూరులో చేనేత కుటుంబానికి చెందిన నందం సుబ్బయ్యను చంపింది వైసీపీ కిరాతకులే. మంగళగిరిలో ఇప్పటి వరకు టీడీపీ గెలిచింది. ఒక్కసారి మాత్రమే. లోకేష్‌కు వద్దని వారించినా, ఓడిన చోటనే గెలవాలని నిర్ణయించుకుని వచ్చి ఘన విజయం సాధించారు. మొదటి సారి ఐదువేల ఓట్ల తేడాతో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్.. రెండోసారి 90వేలతో గెలవడం ఆనందంగా ఉంది. 3 వేల కుటుంబాలకు దుస్తులు పెట్టీ పట్టాలు అందించిన ఘనత లోకేష్‌ది. మంగళగిరిని రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దాలని నిర్ణయించిన నాయకుడు లోకేష్. స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేశారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


చేనేత క్లస్టర్ల ప్రొడక్ట్స్‌‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు..

కాగా, మంగళగిరిలో ఇవాళ(గురువారం) 11వ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. చేనేత ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఏపీలో పలు చేనేత క్లస్టర్ల ప్రొడక్ట్స్‌‌ను సీఎం పరిశీలించారు. క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అడిగారు. పది క్లస్టర్లలో పది మంది డిజైనర్లను నియమించామని అధికారులు తెలిపారు. చేనేత ఉత్పత్తులకు ఏ మేర డిమాండ్ ఉందని డిజైనర్లను సీఎం చంద్రబాబు అడిగారు. చేనేత ఉత్పత్తులపై సెలబ్రిటీలు మక్కువ చూపుతున్నారని డిజైనర్లు తెలిపారు. సెలబ్రిటీలకే కాక సామాన్యులకూ చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. చేనేత ఉత్పత్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Fire Accident: ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు

CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం

For More AP News and Telugu News

Updated Date - Aug 07 , 2025 | 02:42 PM