Share News

AP Cabinet Meeting ON Amaravati: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:32 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.

AP Cabinet Meeting ON Amaravati: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం
AP Cabinet Meeting ON Amaravati

అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ (శుక్రవారం) ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. జలవనరుల శాఖ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. క్యారవాన్‌ పర్యాటకంపైనా నిర్ణయం తీసుకుంది. అమృత్‌ పథకం 2.O పనులను ఆమోదించింది ఏపీ కేబినెట్‌.


అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు..

అలాగే, రాజధాని అమరావతి ( Amaravati Capital) నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీఏకి ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్ కోసం కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. వారి నుంచి భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చి.. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతుల భూముల్లో ప్లాట్‌లు వచ్చిన వారికి ఊరట లభించింది. అటు ప్రభుత్వ భవన సముదాయాల పక్కన ఉండి.. ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను కూడా సేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది మంత్రి మండలి. ఈ నిర్ణయంతో అమరావతి భూముల విషయంలో పూర్తిస్థాయిలో అడ్డంకులు తొలగిపోయాయి.


ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం అసంతృప్తి..

ఏపీలోని అన్ని చెరువుల్లో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులను అభినందించారు సీఎం చంద్రబాబు. పూర్ణోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చాలని సూచించారు. విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను సీఎం అభినందించారు. ఇలాంటి ఉత్సవాలు ప్రతి జిల్లాలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఆయా జిల్లాల ఇన్‌‌ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని హుకుం జారీ చేశారు. ఈనెల 16వ తేదీన జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.


పలు రిజర్వాయర్లకు మరమ్మతులు: మంత్రి కొలుసు పార్థసారథి

Kolusu.jpg

హంద్రీ– నీవా ప్రాజెక్టులో అమిడ్యాల లిఫ్ట్ స్కీమ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్- దివిసీమ ప్రాంతాల్లో వరదనష్టం నివారణ పనులు చేసేందుకు గత సంవత్సరమే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని.. ఇందుకోసం రూ.107 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద, దివిసీమ వద్ద వీక్ అయిన బండ్స్‌ను రూ.4.49కోట్లతో పనులు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని అన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్‌ని 1981- 1982లో నిర్మాణం చేశారని తెలిపారు. 2021లో వచ్చిన భారీ వరదలను పట్టించుకోకపోవడంతో రూ.3కోట్లతో రిపేర్లు చేయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. లక్షా 15 వేల ఎకరాలకు నీరు అందించడం, తిరుపతి, తిరుమలకు తాగునీరు అందించేందుకు 2017-2018లో టెండర్లని ఎన్‌సీసీకి ఇచ్చారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును గత జగన్ ప్రభుత్వం మూలన పడేసిందని విమర్శించారు. తిరుపతిలో ప్రతి సంవత్సరం ప్లోటింగ్ పాపులేషన్ పెరుగుతూనే ఉందని తెలిపారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన పనులు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.


క్యారవాన్ టూరిజం..

అనంతపురం- ఉరవకొండ – వజ్రకరూరు కొత్త లిఫ్ట్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దీని ద్వారా 10వేల 500 ఎకరాలకు సాగు, తాగునీరు వస్తుందని వివరించారు. ఈ పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. ఏపీ టూరిజం పాలసీలో క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టే ప్రోత్సాహకాలు చేర్చామని వెల్లడించారు. పెన్నా నదిపై మిడ్ పెన్నా రిజర్వాయర్‌ని 1962లో నిర్మించారని గుర్తుచేశారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో నిర్వాహణ చేయకపోవడంతో చాలా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని 10 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని వివరించారు. ప్రతి జిల్లాలో రూ.15వేల చొప్పున ఆటోడ్రైవర్లకు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 2,90,669 మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024- 2029కి క్యారవాన్ పార్కులు, క్యారవాన్లకి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని అన్నారు. క్యారవాన్లు పెట్టేవారికి లైఫ్ ట్యాక్స్ , పార్కులు ఏర్పాటు చేసేవారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బదిలీల్లో వందశాతం ఇన్సెంటివ్ ఉంటుందని వివరించారు. మొదటిగా వచ్చిన 25 క్యారవాన్లకు 100శాతం లైఫ్ ట్యాక్స్ మాఫీ ఉంటుందని... ఆ తర్వాత వచ్చే వాటికి ఇన్సెంటివ్‌లు ఉంటాయని తెలిపారు. హోంస్టేలకు సంబంధించి టూరిజం పాలసీని మంత్రి మండలి ఆమోదించిందని తెలిపారు. 1 నుంచి 6 రూములు హోంస్టేల కిందకు వస్తాయని.. అంతకు మించితే హోటల్‌గా పరిగణిస్తామని చెప్పుకొచ్చారు. ఈ హోంస్టేలలో ఓనర్లు కూడా అందులో నివాసం ఉండాలనే నిబంధన తప్పనిసరి చేశామని మంత్రి కొలుసు తెలిపారు.


ఎస్‌పీవీలు ఏర్పాటుకు ఆమోదం..

‘సీఆర్డీఏలో అమరావతి అభివృద్ధిలో భాగంగా ఎస్‌పీవీలు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. వీటికి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటివి టైమ్ టూ టైమ్ అందిస్తాం. ఏపీ సీఆర్డీఏ యాక్ట్ 2014లో 37,916 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదించాం. అయితే 34,385 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం. 3,500 ఎకరాల భూమిని రైతులు పూలింకి ఇవ్వలేదు. 2101.5 ఎకరాలు దీనిలో 191.62 ఎకరాల అక్విజేషన్‌కి అవార్డు పాస్ చేశాం. 369.23 ఎకరాలు పూలింగ్‌కి ఇస్తాం. 1,197 ఎకరాలను వైసీపీ విత్ డ్రా చేసుకుంది. ఇంకా 343 ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ నుంచి విత్ డ్రా చేసుకోవాల్సి ఉంది. ఎక్కడైనా రోడ్డు నిర్మాణానికి భూమి అడ్డు ఉంటే అక్కడ ల్యాండ్ అక్విజేషన్‌కి నోటిఫై చేసి తీసుకోవచ్చని నిర్ణయించాం. ఎస్‌వీయూకు గుంటూరులో కేటాయించిన భూమిని ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.


ట్రాన్స్ కో డిపార్టుమెంట్‌లో సవరణలు..

‘నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.1000 కోట్లు అదనపు రుణంగా తీసుకునేందుకు, దాన్ని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌కి బదలాయించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఏపీ రిఫరెన్స్ స్టేషన్ నెట్‌వర్క్‌ని నేషనల్ నెట్‌వర్క్‌ స్టేషన్‌తో అనుసంధానించడానికి ఎంఓయూ చేసుకున్నాం. ఏపీ ట్రాన్స్ కో డిపార్టుమెంట్‌ ఉత్తర్వుల్లోని కొన్ని నిబంధనలు సవరించడానికి ఇంధన శాఖ ప్రతిపాదనలకు ఆమోదించాం. జేఎస్‌డబ్ల్యూ న్యూ ఎనర్జీ జలదుర్గం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా వచ్చే విద్యుత్‌ని అక్కడ నిర్మించే స్లీల్ ప్లాంట్‌కి వాడుకోవడానికి చేసిన ప్రతిపాదనను ఆమోదించాం. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డెవలప్ చేయాలని నిర్ణయించాం. దీనికి ఒక సలహామండలి నిర్మాణానికి ఆమోదించాం. ఏపీ అసైన్‌ల్యాండ్ 1977ని సవరణకు నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అసైన్‌ల్యాండ్‌ని కౌలుకు ఇచ్చేలా అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనకి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 08:03 PM