PVN Madhav: వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:58 PM
వాజ్‌పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్‌పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) ఆహార్యం, రూపం, గొప్ప వ్యక్తిత్వం, అన్నీ ఆదర్శప్రాయమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) వ్యాఖ్యానించారు. 1942లో స్వతంత్ర సేనానిగా ఆయన ప్రయాణం మొదలైందని ప్రస్తావించారు. దేశంలో కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్యం తేవాలని వాజ్‌పేయి పని చేశారని పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ప్రజల కోసం పోరాటాలు చేసి వాజ్‌పేయి జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టి తొలి ప్రసంగంలోనే అందరినీ ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ ఇవాళ(గురువారం) వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు పీవీఎన్ మాధవ్.
సీఎం చంద్రబాబు కృషితో..
‘వాజ్‌పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతిని ఆదర్శ రాజధానిగా నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. అటువంటి అమరావతిలో వాజ్‌పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు. 13 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహా ఆవిష్కరణకు చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు రావడంతో ఈ కార్యక్రమానికి మరింత వన్నెవచ్చింది. చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరూ నాలుగు సార్లు సీఎంగా ఉండటం విశేషం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తరలి రావడం ఆనందంగా ఉంది. ఈ విగ్రహ ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా మంత్రి నారాయణ సహకరించారు. నేను చిన్ననాటి నుంచి వాజ్‌పేయిను చూసే అదృష్టం కలిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నేడు ఆయన శతజయంతిని నిర్వహించడం ఆనందం కలిగించింది. ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ఆయన స్పూర్తిని తెలియజేశాం. ఈ కార్యక్రమాల గురించి చంద్రబాబుకు చెప్పగానే.. సంతోషం వ్యక్తం చేసి.. పూర్తిగా సహకారం అందించారు. కూటమి పార్టీల నేతలంతా భాగస్వామ్యం కావాలని టెలిఫోన్ కాన్పరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. వాజ్‌పేయి విగ్రహాల ఆవిష్కరణ, యాత్రలకు సహకారం అందించాలని చెప్పిన సీఎం చంద్రబాబుకు నా ధన్యవాదాలు. అమరావతిలో మేమే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చంద్రబాబు ఆరోజే మాకు చెప్పారు’ అని చెప్పుకొచ్చారు పీవీఎన్ మాధవ్.
సుపరిపాలన కేంద్రం ఏర్పాటు చేయాలి..
‘మేము వాజ్‌పేయి విగ్రహంతో పాటు, స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరగానే సీఎం అంగీకరించారు. సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే ఉద్యోగులు, పాలకులు అందరూ వాజ్‌పేయిను స్మరిస్తూ వెళ్లే విధంగా వెంకటపాలెం కూడలిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. సుపరిపాలన కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నాం. రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజాప్రతినిధి కావాలన్నా.. ఈ కేంద్రం ద్వారా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన కేంద్రాలు ఉన్నందున, మన అమరావతిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ఆనాడు నెహ్రూ కూడా భావి భారత ప్రధానిగా వాజ్‌పేయిను అభివర్ణించారు. ఇందిరా ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు జైలులో ఉండి పోరాటం చేశారు. దేశంలో కాంగ్రెస్ యేతర పక్షాలను ఏకం చేసి అధికారంలోకి తీసుకువచ్చారు. జనతా ప్రయోగం నిష్ప్రయోజనం కావడంతో.. బీజేపీని 1980 ఏప్రిల్ 6న ఏర్పాటు చేశారు. కమలం అంటే.. సింబల్ కాదు.. దాని వెనుక ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి.. ఒక్కో రేఖ ఒక్కో విధానానికి చిహ్నం. సంస్కృతి ఆధారంగా దేశం నిర్మాణం కావాలని వాజ్‌పేయి తపించారు. దేశంలో మహాత్మాగాంధీ చెప్పిన విధంగా, అంత్యోదయ, సర్వోదయ పేరుతో చిట్టచివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు’ అని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
వాజ్‌పేయి విలువలను కాపాడారు...
‘విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఐదు అంశాలతో ఈ కమలం గుర్తును ఏర్పాటు చేశారు. రెండు సీట్లే వచ్చినా... నిరాశ పడకుండా వాజ్‌పేయి, అద్వానీ కలిసి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగారు. 1996లో 160 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. అనేక పార్టీలను కలుపుకుని ప్రధాని అయిన వాజ్‌పేయి13 రోజుల్లో దిగిపోయారు.1998లో ప్రధానిగా ఉన్న సమయంలో ఒక్క ఓటుతో పదవిని వదిలి, విలువలను కాపాడారు. 1999లో పూర్తిస్థాయి ప్రధానిగా దేశం దశ దిశను మార్చారు. అనేక ఆదర్శవంతమైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు. వాజ్‌పేయి స్పూర్తితో మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారు. కూటమిపై నమ్మకంతో ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఆ నమ్మకం నిలబెట్టుకునేలా రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుంది. అటల్ - మోదీ సుపరిపాల యాత్రను డిసెంబరు 11వ తేదీన ధర్మవరంలో ప్రారంభించి, నేడు ముగింపు సభ చేసుకుంటున్నాం. ఎక్కువగా విగ్రహాలు పెట్టకుండా జిల్లాకు ఒక వాజ్‌పేయి విగ్రహం పెట్టి ఆయన స్పూర్తిని ప్రజలకు తెలియజేశాం. వాజ్‌పేయి చూపిన ఆదర్శవంతమైన రాజకీయాల గురించి నేటి తరం, భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. ఆరోజు చైనా మన భూమిని ఆక్రమిస్తే.. అడిగినందుకు నెహ్రూ ఆ భూమి మనకు ఉపయోగపడదని చెప్పారు. దీనిపై వాజ్‌పేయి తనదైన శైలిలో గళమెత్తి.. మన దేశంలో ప్రతి భూమి మనదే అంటూ నినదించారు. మన దేశం మీద మనకు గౌరవం, ప్రేమ ఉండాలని చాటి చెప్పారు’ అని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ
క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి
Read Latest AP News And Telugu News