Supreme Court On Mohit Reddy:ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:46 PM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
ఢిల్లీ, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case)లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohit Reddy) కి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(శుక్రవారం) విచారణ జరిపింది. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతివాదులకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణని నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.
తదుపరి విచారణ వరకూ మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడిందని.. ఏపీ పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు మోహిత్‌రెడ్డి న్యాయవాది. ఇదే కేసులో తన తండ్రి జైల్లో ఉన్నారని, తనని కూడా పంపాలని చూస్తున్నారని మోహిత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మోహిత్‌రెడ్డి వాదనలను ఖండించారు ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.
మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది కారు పట్టుకున్నందుకు కాదని... కారులో పెద్ద మొత్తంలో డబ్బులని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేశారని న్యాయవాది ముకుల్ రోహత్గి గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో... ఈ కేసు పెట్టారని, ఆయన తండ్రి ఒక రాజకీయ నేత, మోహిత్ రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేశారని పేర్కొన్నారు ముకుల్ రోహత్గి. ఇది మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారమని, అక్కడ ముడుపుల రూపంలో తీసుకున్న డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని తెలిపింది ప్రభుత్వం. ఇలాంటి కుంభకోణాన్ని తన సర్వీసులో ఎప్పుడూ చూడలేదని న్యాయస్థానానికి ముకుల్ రోహత్గి వివరించారు.
సుమారు రూ.3,500 కోట్ల కుంభకోణం దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయని ముకుల్ రోహత్గి తెలిపారు. మద్యం విధానంలో మార్పులు చేసి... ప్రముఖ కంపెనీల పేరున్న బ్రాండ్స్ అన్ని తీసేసి... ఊరు, పేరు లేని బ్రాండ్స్‌ని తీసుకువచ్చారని వివరించింది ప్రభుత్వం. మద్యం విధానం ద్వారా... దాదాపు వంద రెట్లకు పైగా... నిధులు సమకూర్చుకున్నారని, వాటినే ఎన్నికల్లో ఖర్చు చేశారని ముకుల్ రోహత్గి వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తన వాదనలనూ కౌంటర్‌లో చెప్పాలని ఆదేశించింది జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. అప్పటి వరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. నాలుగు వారాల తర్వాత విచారణ చేపడుతామని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
Read Latest AP News And Telugu News