Share News

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర: పురందేశ్వరి

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:30 PM

చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర:  పురందేశ్వరి
Purandeswari on Women Leadership

తిరుపతి, సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర ఈ రోజుల్లో చాలా కీలకమని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఉద్ఘాటించారు. రాష్ట్ర, కేంద్ర, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా ప్రజాప్రతినిధుల అర్థవంతమైన ఆలోచనలు పంచుకోవటానికి ఈ సదస్సు వేదిక అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇవాళ(సోమవారం) తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని ప్రసంగించారు.


మహిళలు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. వికసిత భారత్ సాధన అనే లక్ష్యం దేశంలో మహిళల ప్రగతిపై ఆలోచనను మార్చిందని తెలిపారు. వికసిత భారత్ కోసం మహిళా అభివృద్ధి ‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ ఈ రెండు అంశాలపై డిబేట్ జరిగిందని వివరించారు. మహిళాశక్తి వెనుక ఉండి నడపటం కాదని... ముందు వరుసలో ఉండి నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర అని ఉద్ఘాటించారు. మహిళల ప్రగతితోనే వికసిత భారత్ సాధ్యమని నొక్కిచెప్పారు దగ్గుబాటి పురందేశ్వరి.


చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను మరింతగా పెంచిందని ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని తెలిపారు. స్వయం ఉపాధిలో 30 శాతం ఇటీవల పెరిగిందని చెప్పుకొచ్చారు. 70 కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా, 400 పథకాలు రాష్ట్రాల్లోని పథకాలతో మహిళల ఉపాధికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇది ప్రారంభం మాత్రమేనని... ప్రతి రాష్ట్రంలోనూ మహిళా సాధికారత కమిటీలు ఏర్పడాలని ఆకాంక్షించారు. మహిళా సంక్షేమం కోసం ఇలాంటి సదస్సులు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు జరగాలని సూచించారు. పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా వల్లే ఈ సదస్సులు దేశంలో తొలిసారిగా ప్రారంభమైందని ఉద్ఘాటించారు. మహిళ సాధించలేనిది ఏదీ లేదని... తనపై తాను ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 04:36 PM