Share News

Street Dog in Hindupur: కుక్కల బెడదకు చెక్‌.. షెల్టర్‌జోన్‌ ఏర్పాటు

ABN , Publish Date - Dec 08 , 2025 | 09:34 AM

పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్‌ అధికారుల్లో కదలిక వచ్చింది.

Street Dog in Hindupur: కుక్కల బెడదకు చెక్‌.. షెల్టర్‌జోన్‌ ఏర్పాటు
Street Dog in Hindupur

వీధికుక్కల కోసం షెల్టర్‌జోన్‌

కుక్కల సంఖ్య పెరగకుండా ప్రత్యేక చర్యలు

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కదలిక

హిందూపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు (Stray Dogs Control) ఎట్టకేలకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్‌ అధికారుల్లో కదలిక వచ్చింది. హిందూపురంలో ప్రమాదకర కుక్కలను బంధించి వాటిని షెల్టర్‌జోన్‌ ఏర్పాటుచేసి అక్కడే ఉంచి ఆహారాన్ని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలకాలంలో వీధికుక్కలబారిన పడి పలువురు మృత్యువాత, వందలాది మంది గాయాలపాలవుతున్నారు. అంతేకాక కొన్ని ప్రమాదకర కుక్కలు వాహనాల్లో వెళ్లే సమయంలో వెంటబడి కరుస్తున్నాయి. ఇలాంటివాటిని గుర్తించే పనిలో మున్సిపల్‌ అధికారులున్నారు. హిందూపురంలో అధికారుల లెక్కల ప్రకారం 2200 వీధికుక్కలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువశాతం కుక్కలకు ఆపరేషన్‌ చేశారు. వెంటబడి కరిచే కుక్కలను బంధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


సంఖ్య పెరగకుండా..

హిందూపురంలో అధికారుల లెక్కల ప్రకారం 2, 200 వీధి కుక్కలు ఉన్నట్లు చెబుతున్నా ఈ సంఖ్య రెండింతలు అధికంగా ఉంటుందని అంచనా. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది హిందూపురం మొత్తంగా 2,200కుక్కలు మాత్రమేనని అధికారుల లెక్కలుచెబుతుండగా 4వేల నుంచి 5వేల దాకా ఉండవచ్చని అంచనా. వీటి సంఖ్యమరింత పెరగకుండా ఉండేందుకు వీధికుక్కలను బంధించి వాహనంలో పెనుకొండకు తీసుకెళ్లి ఆపరేషన్‌ అనంతరం వదిలేస్తున్నారు.


షెల్టర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం

ఇప్పటి వరకు హిందూపురంలో వీధికుక్కలు పట్టుబడితే వాటిని ఉంచడానికి ఎలాంటి సౌకర్యాలులేవు. వీటికితోడు ఆపరేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు కూడా లేవు. హిందూపురంలో పాఠశాలల వద్ద, చికెన్‌ సెంటర్లవద్ద, ప్రధాన కూడళ్లలో, మరికొన్నిచోట్ల మనుషుల వెంటబడి కరిచే కుక్కలను గుర్తించారు. వీటి సంఖ్య 150దాకా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీటిని బంధించి పరిగి రోడ్డులో ఉన్న పాత చెత్తడంపింగ్‌యార్డ్‌ వద్ద షెల్టర్‌ ఏర్పాటుచేసి అక్కడ బోన్‌లలో ఉంచేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సుమారు రూ.25లక్షలు ఖర్చవుతుందని కౌన్సిల్‌ తీర్మానానికి పంపనున్నట్లు తెలిపారు. అయితే ఏర్పాటుచేసిన షెడ్డు కనీసం 500కుక్కలకు సరిపడేలా ఉంటేనే లేదా వంద కుక్కల్లోపు షెడ్డులో వేసినా ప్రయోజనం ఉండదు.


న్యాయస్థానం ఆదేశాలతో..

దేశంలో వీధికుక్కల బారినపడి వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. మరికొంతమందికి ర్యాబిస్‌ వ్యాధి ఉన్న కుక్కలు కరవడంతో మతిస్థిమితం లేకుండా చనిపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. వీధి కుక్కలు ఎక్కడా కనబడకూడదని ఆదేశాలు ఇచ్చిం ది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వీధి కుక్కలను ని యంత్రించేందుకు చర్యలుచేపడుతున్నారు. ఒకేసారి ఇన్ని కుక్కలను బంధిస్తే వాటిని వ్యాధులను గుర్తించి ఒకవేళ ర్యా బిస్‌ వ్యాధి, సంక్రమించే వ్యాధులుంటే ప్రత్యేక బోనులో ఏర్పాటు చే యా లి. పట్టుకున్న ప్రతి కుక్కకు ర్యాబిస్‌ వ్యాధి నివారణ టీకాలు వే యాల్సి ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


షెడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం

హిందూపురంలో వీధి కుక్కలను గుర్తించాం. అందులో ప్రమాదకర కుక్కలను కూడా గమనించాం. వీటిని పట్టుకుని ప్రత్యేక షెడ్డు ఏర్పాటుచేసి అక్కడే ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కౌన్సిల్‌ తీర్మానానికి కూడా పంపుతున్నాం.

- మల్లికార్జున, మున్సిపల్‌ కమిషనర్‌


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 08 , 2025 | 09:35 AM