Share News

Lok Sabha Polls 2024: చివరిలో ఓటరు మూడ్ మారిందా.. తెలంగాణలో మెజార్టీ సీట్లు ఆ పార్టీవేనా..?

ABN , Publish Date - May 21 , 2024 | 05:18 PM

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

Lok Sabha Polls 2024: చివరిలో ఓటరు మూడ్ మారిందా.. తెలంగాణలో మెజార్టీ సీట్లు ఆ పార్టీవేనా..?
Congress, BRS,BJP

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలుచేస్తున్నామని.. తమకే ఓట్లు పడతాయని కాంగ్రెస్ నేతలు అంచనావేశారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ బలహీనపడటం తమకు కలిసివస్తుందని భావించారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలే కావడంతో తమ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత ఉండదని హస్తం పార్టీ నేతలు లెక్కలు కట్టారు. ఓటింగ్ జరిగిన తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైందనే చర్చ జరుగుతోంది.


గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటు వేసినవారిలో దాదాపు 20 నుంచి 30 శాతం మంది బీజేపీకి ఓటు వేశారని.. మరోవైపు బీఆర్‌ఎస్ ఓటు కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకే ఎక్కువుగా బదిలీ అయినట్లు లెక్కలు అందుతున్నాయట. దీంతో 8 సీట్లలో అయినా గెలుస్తామా లేదా అనే అనుమానంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారట. మరోవైపు 2019లో గెలిచిన నాలుగు సీట్లకు అదనంగా ఎన్ని గెలిచినా బోనస్‌గా వచ్చినట్లేనని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఎన్నికల ముందు డబుల్ డిజిట్ సాధిస్తామని కమలం నేతలు చెప్పినా.. ఆరు నుంచి 8 సీట్లు తప్పనిసరిగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఎన్నికల పోలింగ్ ముగిసన తర్వాత పోలింగ్ సరళి.. పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న నివేదికల తర్వాత బీజేపీ డబుల్ డిజట్ సీట్లు సాధిస్తుందనే నమ్మకం పార్టీ నేతల్లో పెరిగిందట. కనీసం రెండు నుంచి మూడు సీట్లలో అయినా గెలవాలని భావించిన బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఒక సీటు అయినా గెలుస్తామా లేదా అని గులాబీ నేతలు టెన్షన్ పడుతున్నారట.

TG News: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రత్మకం: ప్రేమేందర్ రెడ్డి


ఓటరు మూడ్ మారిందా..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోసారి కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తే.. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఓ వర్గానికి ఆస్తులు పంచేస్తారంటూ బీజేపీ ప్రచారం చేశాయి. మరోవైపు హిందువలును పోలరైజ్‌ చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నించింది. మొదట్లో హిందువుల ఓట్లు ఏకమవుతాయని ఎవరూ ఊహించలేదు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదని అన్ని పార్టీలు భావించాయి. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింల ఓట్లు తమకు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచించింది. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత ఓవైసీ బహిరంగంగానే చెప్పారు. ఎంఐఎం పోటీలోలేని 16 స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని పరోక్షంగా చెప్పారు. ఇది ఇప్పుడు బీజేపీకి కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ముస్లింల ఓట్లు పోలరైజ్ అవుతున్నప్పుడు హిందువులంతా ఐక్యంగా ఓటేయ్యాలని గ్రామాల్లోని ఓటర్లు నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే చివరిలో మారిన ఓటరు మూడు.. కాంగ్రెస్‌కు నష్టం కలిగించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. బీజేపీ మాత్రం సైలెంట్ ఓటింగ్ తమకు కలిసి వచ్చిందని.. తాము ఊహించిన సీట్లకంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆశలు లేని పెద్దపెల్లి స్థానంలో కాషాయజెండా ఎగురుతుందంటూ బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి స్థానంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటే ఆ పార్టీ 10 సీట్లు గెలిచే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


బీఆర్‌ఎస్ ఓటు ఎటు..

బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలం లేకపోయినప్పటికీ డబుల్ డిజిట్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండటానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్ ఓట్లు తమకు బదిలీఅయ్యాయనే ఒకే ఒక ఆశ. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో.. ఎలాగైనా కాంగ్రెస్‌ను ఓడించాలనుకున్న బీఆర్‌ఎస్ శ్రేణలు తమ ఓట్లను బీజేపీకి వేయడంతో పాటు.. పార్టీ కార్యకర్తలు, అభిమానులతోనూ బీజేపీకి ఓటు వేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికలు కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కావడం, బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచినా పెద్ద ఉపయోగం లేదని భావించిన ఓటర్లు ఆ ఓట్లను బీజేపీకి వేశారనే చర్చ నడుస్తోంది. నిజంగా బీఆర్‌ఎస్ ఓటు బీజేపీకి బదిలీ అయిందా లేదా అనేది జూన్4న తేలనుంది. ఓటరు మూడ్ ఎలా ఉంది.. ఎవరికి ఎక్కువ సీట్లు ఇవ్వనున్నారనేది ఓట్ల లెక్కింపు రోజు బయటపడనుంది.


Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Telangana News and Telugu Latest News

Updated Date - May 21 , 2024 | 05:18 PM