సూర్య @ 40 ప్లస్
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:42 AM
ఉమ్మడి మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అటు అధికార యంత్రాంగం, ఇటు సామాన్య ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో భానుడి ప్రతాపం.. అల్లాడుతున్న జనం
82 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.. ఆరంజ్ అలర్ట్ జారీ
చేగుంట, తుక్కాపూర్, శనిగరంలలో అత్యధికంగా 42.7 డిగ్రీలు
జనం లేక వెలవెలబోతున్న ప్రధాన చౌరస్తాలు, రహదారులు
ఉమ్మడి జిల్లాల్లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా ముదురుతున్నాయి. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఉదయం 9 గంటల నుంచే జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేడి గాలుల తాకిడికి తోడు పెరిగిన ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ప్రధాన కూడళ్లన్నీ మధ్యాహ్నం వేళ జన సంచారం లేక వెలవెలబోతున్నాయి.
కోహీర్(సంగారెడ్డి): ఉమ్మడి మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అటు అధికార యంత్రాంగం, ఇటు సామాన్య ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మంగళవారం 82 ప్రాంతాలలో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అందులో 21 ప్రాంతాలు 42 డిగ్రీల మార్కును దాటడం ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నది. దీంతో ఆ 82 ప్రాంతాలను వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జోన్లుగా ప్రకటించింది. వడగాల్పులు, ఉక్కపోతకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే రోడ్లు జనం లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఉష్ణోగ్రతలిలా..
మెదక్ జిల్లాలో 23 చోట్ల 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదుకాగా, అత్యధికంగా చేగుంటలో 42.7 డిగ్రీలు నమోదైంది. ఇక పాతూరు, కౌడిపల్లి ప్రాంతాల్లో 42.5 డిగ్రీలు నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 28 ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపగా, తుక్కాపూర్, శనిగరం ప్రాంతాల్లోనూ 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పోతిరెడ్డిపేట, రాఘవాపూర్ ప్రాంతాలు కూడా 42.6 డిగ్రీలతో నిప్పుల కొలిమిలా మారాయి. సంగారెడ్డి జిల్లాలో ఏకంగా 31 చోట్ల 40 డిగ్రీలు దాటగా, గరిష్టంగా నాగల్‌గిద్దలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అన్నసాగర్, వట్‌పల్లి తదితర ప్రాంతాల్లో 42.2 డిగ్రీల వేడి గాలి స్థానిక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండలకు వడగాల్పులు తోడవడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. మధ్యాహ్న సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చే చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఉపాధి హామీ పనులు చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు ఎండ ధాటికి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. బైక్‌పై ప్రయాణించలేని పరిస్థితి నెలకొన్నది.
జాగ్రత్తలు తప్పసరి..
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నది. వడదెబ్బ తగలకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా తలకు గుడ్డ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింతగా ముదిరే అవకాశముందుని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి వైద్యులు కోరుతున్నారు.
చౌరస్తాలు వెలవెల..
చిన్నకోడూరు: వారం రోజుల క్రితం జల్లులతో కాస్త ఉపశమనం లభించినా, ప్రస్తుతం మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. దీంతో చిన్నకోడూరు మండలంలోని అంబేడ్కర్ చౌరస్తా, వివేకానంద చౌరస్తాలతో పాటు ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నం వేళ జనం లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు దాహం తీర్చుకోవడానికి కొబ్బరి బొండాలు, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం
దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు
Read Latest Telangana News and National News