Share News

ఖాకీ మాటున కాసుల వేట

ABN , Publish Date - Apr 15 , 2026 | 08:43 AM

ట్రై కమిషనరేట్స్‌లోని పలువురు పోలీసులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు.

ఖాకీ మాటున కాసుల వేట

  • రాంగ్‌ రూట్‌లోకి పలువురు రక్షకభటులు

  • అతిపెద్ద కాలనీ పోలీస్‌ స్టేషన్‌.. అక్రమ వసూళ్లకు అడ్డా?

  • సెక్టార్‌ల వారీగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు

హైదరాబాద్‌ సిటీ: ట్రై కమిషనరేట్స్‌లోని పలువురు పోలీసులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. తమకు న్యాయం చేయాలని స్టేషన్‌ గడప తొక్కుతున్న వారిని భయభ్రంతులకు గురి చేసి సొమ్ములు డిమాండ్‌ చేస్తూ.. ఇవ్వని పక్షంలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కుతున్నారు.


అతిపెద్ద కాలనీ పోలీస్‌ స్టేషన్‌..

అతిపెద్ద కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఎంతో సౌమ్యంగా కనిపిస్తూ.. స్టేషన్‌లో నమోదయ్యే కేసుల విషయంలోనూ ఏ సెక్షన్‌లు పెట్టాలో కూడా స్టేషన్‌ రైటర్‌పై ఆధారపడిన సదరు ఇన్‌స్పెక్టర్‌. కొత్త సీపీ వచ్చిన నేపథ్యంలో పోస్టింగ్‌ ఉంటుందో, పోతుందో తెలియడం లేదని.. ఉన్న కొద్ది రోజుల్లోనే అందినంతా దండుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సెక్టార్‌ల వారీగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులు కురిపించే పాత కేసులు ఏమున్నా బయటికి తీయండి.. అందినంతా దండుకుందాం అంటూ బాహాటంగానే మాట్లాడుతున్నట్లు సమాచారం.


  • ఇటీవల సదరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక హోటల్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దర్యాప్తులో భాగంగా హోటల్‌ యజమాని వద్ద రూ. లక్షల్లో డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.

  • కోర్టు కేసుల్లో ఉన్న ఓ భవనం వివాదంలో తలదూర్చినట్లు తెలిసింది. ఫ్లాటు కొనుగోలు చేసిన వారికి పొజిషన్‌ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినట్లు వినికిడి. ఈ భవనం కేసు కోర్టులో ఉందని, స్టే ఆర్డర్‌ ఉందని, కోర్టు అనుమతి లేకుండా ఏమీ చేయలేము అని బాధితులు చెప్పినా వినిపించుకోకుండా పొజిషన్‌ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇలా ఏ పంచాయతీ ఉన్నా.. ఎస్సైలతో కలిసి సెక్టార్‌ల వారీగా సెటిల్‌మెంట్స్‌ చేస్తున్నట్లు, బాహాటంగానే తన వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


city4.jpgస్టేషన్‌లో ఎవరి ఇష్టం వారిదే

స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో పనితీరు చూసిన తర్వాత.. స్టేషన్‌లో పనిచేస్తున్న సెక్టార్‌ ఎస్సైలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా అందినంతా దండుకుంటున్నట్లు సమాచారం. ఇన్‌స్పెక్టర్‌లు, అడ్మిన్‌ ఎస్సైలు, ఎస్సైలు, క్షేత్రస్థాయి సిబ్బంది.. ఇలా ఎవరికి వారు.. వారి స్థాయిని బట్టి.. కాసులో వేటలో పడ్డారు.


ఈ ఘటనలు నిదర్శనం

  • ఇటీవల న్యాయం చేయమని స్టేషన్‌కు వెళ్లిన బాధితుడికి.. న్యాయం చేయాల్సిన ఎస్సై.. ఏకంగా మద్యం బాటిళ్లు కావాలని లంచం డిమాండ్‌ చేశాడు.

  • వారం రోజుల క్రితం నకిలీ ధ్రువపత్రాల కేసులో లంచం డిమాండ్‌ చేసిన ఆర్జీఐ ఎయిర్ట్‌ పోర్టు ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 2లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

  • కొద్ది రోజుల క్రితం ఓ కేసు విషయంలో లంచం డిమాండ్‌ చేసిన చైతన్యపురి ఏఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు.


  • ఎల్‌బీనగర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఏఆర్‌ఎస్సైలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎల్‌బీనగర్‌ ఫ్లైవోవర్‌ కింద లంచం డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

  • కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ఎస్సై రూ. 50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

  • తాజాగా... ఓ వ్యక్తి కారు నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని గుర్తించిన సదరు ఇన్‌స్పెక్టర్‌..స్టేషన్‌కు పిలిపించి రెండు మూడు రోజులపాటు ఇబ్బంది పెట్టి చివరకు రూ. 2-3లక్షలు తీసుకొని అతడిని వదిలేసినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం

దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2026 | 08:43 AM