దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:04 AM
దూరదృష్టితోనే రాజధాని నగరాలకు పెట్టుబడి పెడతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. రాజధాని అంటే రాష్ట్ర ప్రతిష్ఠ, ఆర్థిక శక్తి అని గుర్తుంచుకోవాలన్నారు.
విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న లేఖ
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): దూరదృష్టితోనే రాజధాని నగరాలకు పెట్టుబడి పెడతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. రాజధాని అంటే రాష్ట్ర ప్రతిష్ఠ, ఆర్థిక శక్తి అని గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు మంగళవారం వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆయన లేఖ రాశారు. 400 సంవత్సరాల నాటి చారిత్రక నగరం హైదరాబాద్‌లో 26 సంవత్సరాల క్రితం నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు హైటెక్ సిటీకి పునాది వేశారన్నారు. ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించటానికి అది వ్యూహాత్మక నిర్ణయమని తెలిపారు. అందుకే అక్కడ ఎకరం భూమి ధర నేడు 100 కోట్లకుపైగా పలుకుతోందని పేర్కొన్నారు. హైటెక్ సిటీ ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయి హబ్‌గా మారిందన్నారు. ఇదే సూత్రం అమరావతి విషయంలోనూ వర్తిస్తుందన్నారు. ఇకనైనా అమరావతిపై అనవసర దుష్ప్రచారాలు ఆపి, ప్రజలతో కలిసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.