శరవేగంగా తుంగభద్ర గేట్ల ఏర్పాటు
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:10 AM
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రాణాధారమైన తుంగభద్ర డ్యాం నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
25 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తి.. మే నెలాఖరులోగా మొత్తం అమరిక
పనులను పరిశీలించిన కన్నయ్యనాయుడు
కర్నూలు, బళ్లారి గాంధీనగర్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రాణాధారమైన తుంగభద్ర డ్యాం నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జలవనరుల శాఖ (మెకానికల్ విభాగం) సలహాదారుడు, గేట్ల నిపుణుడు ఎన్.కన్నయ్యనాయుడు సోమ, మంగళవారాల్లో గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్, బోర్డు ఇంజనీర్ల పర్యవేక్షణలో గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ సంస్థ క్రస్ట్‌గేట్లు తయారి(ఫ్యాబ్రికేషన్), అమర్చడం (ఎరక్షన్) పనులు చేపట్టింది. గత డిసెంబరు 6న గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టి కేవలం 129 రోజుల్లో 25 గేట్లు పూర్తిగా ఏర్పాటు చేయడమే కాకుండా 22 గేట్లు ట్రైల్‌రన్ కూడా పూర్తి చేశారు. మిగిలిన ఐదు గేట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కన్నయ్య నాయుడు ప్రతిగేటును క్షుణంగా పరిశీలించి, టీబీపీ బోర్డు ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. ఈయన వెంట ఏపీ వర్క్‌షాప్ సలహాదారు మెకానికల్ ఇంజనీరు కృష్ణారావు, టీబీపీ బోర్డు సెక్రెటరీ ఓఆర్కే రెడ్డి, కర్ణాటక రాష్ట్రం మునిరాబాద్ సీఈ మలిగవాడ, బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్, డ్యాం ఈఈ చంద్రశేఖర్ ఉన్నారు. ఈ సందర్భంగా కన్నయ్యనాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి, కర్ణాటక ప్రభుత్వ సహకారం, రైతుల త్యాగం వల్లే రికార్డు స్థాయిలో గేట్ల ఏర్పాటు సాధ్యమవుతోందని చెప్పారు. మే 15లోగా మొత్తం గేట్ల ఏర్పాటు పూర్తవుతుందని, ఏమైనా చిన్నచిన్న పనులు మిగిలితే ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు.