వివాహేతర సంబంధాలతో విచ్ఛిన్నమౌతున్న జీవితాలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 08:07 AM
నమ్మకం పునాదిగా సాగాల్సిన వైవాహిక బంధాలు నేడు అనేక రకాల కారణాలతో విచ్ఛిన్నమౌతున్నాయి. నిండా ముప్పై ఏళ్లు కూడా దాటకనే పచ్చని జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ప్రియుడుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత
ప్రియుడి మృతదేహం తీసుకెళ్లిన కుటుంబసభ్యులు
వివాహిత శవం తీసుకెళ్లడానికి రాని తల్లిదండ్రులు, భర్త
అనాథశవంగా ఖననం చేసిన మున్సిపాలిటీ సిబ్బంది
దిక్కులేని వారైన ఆమె ఇద్దరు పిల్లలు
చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన పోలీసులు
నమ్మకం పునాదిగా సాగాల్సిన వైవాహిక బంధాలు నేడు అనేక రకాల కారణాలతో విచ్ఛిన్నమౌతున్నాయి. నిండా ముప్పై ఏళ్లు కూడా దాటకనే పచ్చని జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భర్తతో విభేదాలతో ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి చేరిన వివాహితకు ఓ యువకుడితో సంబంధం ఏర్పడింది. అది సహజీవనంగా మారింది. ఇద్దరూ పిల్లలతో కలిసి వేరే ఊరిలో కొత్త జీవనం మొదలు పెట్టారు. నెలరోజులకే ఒకే చీరకు ఇద్దరూ ఉరేసుకున్నారు. యువకుడి మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఎవ్వరూ రాకపోవడంతో ఆమె మృతదేహానికి మున్సిపాలిటీ వారే అంత్యక్రియలు చేశారు. అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలను పోలీసులు అనాథాశ్రమానికి చేర్చారు. ఈ విషాద సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ఇంతకూ ఈ వ్యవహారంలో తప్పెవరిది.. శిక్ష ఎవరికి అని అందరూ చర్చించుకుంటున్నారు.
ప్రొద్దుటూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ లింగాపురం ఎస్టీ కాలనీలో ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఒకే చీరకు ఉరివేసుకుని ఓ యువకుడు, మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మృతుడు ఆవుల రంగస్వామి(21) కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామం. రామాంజనేయులు, హుస్సేనమ్మల కుమారుడు. మృతురాలు ప్రమీల(32) కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామం. ఆమె వివాహిత.. తన భర్త రాజు. గత ఏడాది ప్రమీలకు భర్తతో మనస్పర్థలు వచ్చి తన ఇద్దరు మగపిల్లలను తీసుకుని అలారుదిన్నెలోని తమ బంధువుల ఇంటికొచ్చింది. ఆ సమయంలో అదే గ్రామంలోని ఆవుల రంగస్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది.
రంగస్వామి ప్రొద్దుటూరులోని డిమార్టులో పనిచేసే వారు. ప్రమీల కూడా తన ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రొద్దుటూరుకు వచ్చి రంగస్వామితో కలిసి సహజీవనం చేస్తోంది. నెల రోజులు తిరగకముందే వీరిమధ్య ఏమైందో ఏమో కానీ.. శనివారం ఇంట్లో ఒకే చీరకు వీరు ఉరివేసుకున్నారు. ఇంటికి తలుపు వేసి ఉండటంతో బయట ఆడుకుంటున్న పిల్లలకు అనుమానం వచ్చి ప్రమీల పెద్ద కుమారుడు ముత్తు (12) తన భుజాల మీద తమ్ముడు ప్రకాశ్ (7)ను ఎక్కించుకుని ఇంటిలోకి తొంగి చూడగా.. వారు ఉరి వేసుకుని ఉండటం గమనించి చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశారు. దీంతో రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని ఆ మృతదేహాలను కిందకి దించారు. వీరిద్దరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. రంగస్వామి మృతదేహాన్ని వారి కటుంబసభ్యులు వచ్చి వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ప్రమీల మృతదేహాన్ని వారు తీసుకెళ్లలేదు.
అనాథగా ప్రమీల మృతదేహం..
ప్రమీల ఆత్మహత్య చేసుకున్న సమాచారం ఆమె భర్త రాజుకు, తల్లిదండ్రులకు రూరల్ పోలీసులు తెలియజేశారు. కౌతాళం మండల పోలీసులకు కూడా తెలిపారు. ప్రమీల కోసం తల్లిదండ్రులు కానీ, కట్టుకున్న భర్త కానీ బంధువులు కానీ రాలేదు. దీంతో రెండు రోజులు చూసిన అనంతరం అనాథ శవంగా పోలీసుల సహకారంతో మున్సిపాలిటీ వాళ్లు అంత్యక్రియలు చేశారు.
దిక్కుతోచని చిన్నారులు..
కళ్లముందే కన్నతల్లి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ పిల్లలను చూసి రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ శ్రీకాంత్ వారిని స్టేషనుకు తీసుకెళ్లి ఓదార్చి కొత్త బట్టలు, వస్తువులు కొనిపించి వారికి కొంత డబ్బు సహాయం చేశారు. భయపడవద్దని మీ బంధువుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రమీల భర్త రాజుకు, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేసినా ఎవ్వరూ రాకపోవడంతో ఆమె అంత్యక్రియలు పోలీసులే పూర్తిచేశారు. అనంతరం పిల్లలిద్దరిని కడపలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆధ్వర్యంలో నడుపుతున్న 'అమ్మ ఒడి' అనాథశరణాలయానికి అప్పగించారు. చిన్నారుల సంక్షేమం, విద్యకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం ద్వారా చేపడతామని సీఐ నాగభూషణం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News