Share News

డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్

ABN , Publish Date - Apr 15 , 2026 | 09:45 AM

దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్
KTR

హైదరాబాద్, ఏప్రిల్ 15: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదని అన్నారు. మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. మూడేళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్‌కే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.


తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.


దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. ‘ఢిల్లీ పాలకులు మా మాట వినాలని, బుద్ధి ప్రబలాలని ఆశిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్‌ చేశారు.


ఇవి కూడా చదవండి...

పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు

850 లోక్‌సభ సీట్లు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 11:26 AM