Share News

సీహెచ్‌వోలకు రాత్రి 8 గంటల ముఖహాజరు రద్దు

ABN , Publish Date - Apr 15 , 2026 | 06:14 AM

వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు(సీహెచ్‌వో) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా వివాదాస్పదంగా మారిన రాత్రి 8గంటల ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌(ఎఫ్ఆర్‌ఎస్‌) హాజరు విధానాన్ని..

సీహెచ్‌వోలకు రాత్రి 8 గంటల ముఖహాజరు రద్దు

  • 8,500మంది మహిళా ఉద్యోగులకు ఊరట.. ఉత్తర్వులు జారీ

గుంటూరు సిటీ, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు(సీహెచ్‌వో) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా వివాదాస్పదంగా మారిన రాత్రి 8గంటల ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌(ఎఫ్ఆర్‌ఎస్‌) హాజరు విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 8 గంటలకు ముఖ గుర్తింపు హాజరు వేసే అంశంపై ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లలో పనిచేస్తున్న సీహెచ్‌వోలు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం 10,345మంది సీహెచ్‌వోలలో దాదాపు 8,500మంది మహిళలే ఉన్నారు. గ్రామీణ, దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వీరికి రాత్రి 8గంటల సమయంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు విధానం భారంగా మారింది. రాత్రివేళల్లో హెల్త్‌ సెంటర్లకు వెళ్లాల్సి రావడం, మార్గమధ్యంలో భద్రతా సమస్యలు, నెట్‌వర్క్‌ లోపాలు వంటివి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలు సందర్భాల్లో హాజరు నమోదు చేయలేకపోవడంతో జీతాలపై ప్రభావం పడినట్లు సీహెచ్‌వోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కేంద్రాల వద్ద నిరసనలు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు, సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఇలా అనేక మార్గాల్లో తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. సీహెచ్‌వోలకు రాత్రి 8 గంటల ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, ఈ నిర్ణయంపై ఏపీ ఎంసీఏ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్‌, కార్యదర్శి సందీప్‌ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 15 , 2026 | 06:16 AM