850 లోక్‌సభ సీట్లు!
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:57 AM
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్‌సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మూడు కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసింది.
రాష్ట్రాల్లో 815.. యూటీల్లో 35కు మించకుండా స్థానాలు
2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన!
చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించడం,లోక్‌సభ స్థానాలను పెంచడం కోసం 3 కీలక బిల్లులు
ముసాయిదా బిల్లులను సర్క్యులేట్ చేసిన ప్రభుత్వం
అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్ల పెంపు ప్రస్తావన లేదు
సుప్రీం న్యాయమూర్తి నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్‌సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మూడు కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసింది. ఒకటి.. మహిళా కోటా అమలుకు వీలుగా లోక్‌సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. పెరిగే స్థానాల్లో 815 సీట్లు రాష్ట్రాల నుంచి, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండేలా ఈ బిల్లులో ప్రతిపాదించారు. రెండోది.. 2011 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు వీలు కల్పించే బిల్లు. మూడోది.. శాసనసభలను కూడా కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ముకశ్మీర్, పుదుచ్చేరిల్లో కూడా 33 శాతం కోటా అమలుకు వీలు కల్పించే బిల్లు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం నుంచి జరుగుతాయనగా.. సోమవారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు ఈ బిల్లుల ముసాయిదాలను పంపిణీ చేసింది. డీలిమిటేషన్‌లో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లు పెంచుతామని, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని బీజేపీ నేతలు, మంత్రులు కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారుగానీ.. ఈ బిల్లుల్లో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్టు మాత్రమే బిల్లులో పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని పేర్కొన్నారు. అయితే.. సీట్లకు సంబంధించి రాష్ట్రాలవారీగా తుది స్థానాల సంఖ్యను డీలిమిటేషన్ కమిషనే నిర్ణయిస్తుంది కాబట్టి బిల్లులో నిర్ణీత శాతాన్నిగానీ, సంఖ్యనుగానీ ప్రత్యేకంగా పేర్కొనలేదని ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడం వల్ల లోక్‌సభ స్థానాల పరంగా రాష్ట్రాల బలాబలాల్లో చాలా తేడాలు వచ్చే అవకాశం ఉందని ‘బార్ అండ్ బెంచ్’ ఒక కథనంలో విశ్లేషించింది. ఏదేమైనా.. ఐదు దశాబ్దాలుగా స్తంభించిపోయిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు, మహిళా కోటాకు రంగం సిద్ధం కావడంతో రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటుచేసుకోనున్నాయి.
ఆలస్యం అవకూడదనే..
2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలంటే ఆలస్యమవుతుంది కాబట్టి.. అప్పటిదాకా ఆ ప్రక్రియను వాయిదా వేయలేం కాబట్టి.. ఇప్పటికే జరిగిన (2011) జనగణన ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం ముసాయిదా బిల్లులో పేర్కొంది. ప్రతి జనగణన తర్వాత లోక్ సభ సీట్లను సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని 82వ అధికరణలో పేర్కొన్న నిబంధనను తొలగించింది. ఇకపై ఏ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలనే విషయాన్ని పార్లమెంటే నిర్దేశిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుందని బిల్లులో పేర్కొంది. రాష్ట్రాలవారీగా సీట్లను కేటాయించడం, నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి రూపొందించడం, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడం వంటి బాధ్యతలను కమిషన్‌కు అప్పగిస్తారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ కోటాలకు కూడా ఇది వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఇక, డీలిమిటేషన్ కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (లేదా ఆయన ప్రతినిధి), సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాల కేటాయింపు, అసెంబ్లీ స్థానాల సంఖ్య సర్దుబాటు చేయడం కమిషన్ ప్రాథమిక విధి. విభజన ప్రక్రియలో కమిషన్‌కు సహాయపడేందుకు ప్రతి రాష్ట్రం నుంచి పది మంది ‘అసోసియేట్’ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే, వీరికి నిర్ణయాలపై ఓటు వేసే/సంతకం చేసే అధికారం ఉండదు. కేవలం సలహాలు, సూచనలకే వీరు పరిమితం. కమిషన్ చైర్మన్ లేదా సభ్యుల పదవుల్లో ఖాళీలు ఏర్పడితే, చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వాటిని వెనువెంటనే భర్తీ చేస్తుంది. బిల్లు ప్రకారం.. కమిషన్ తన విధివిధానాలను స్వయంగా రూపొందించుకుంటుంది. సాక్షులను విచారించడం, పత్రాలను తెప్పించుకోవడం వంటి విషయాల్లో దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
నిర్ణయాల్లో బేధాభిప్రాయాలు వస్తే మెజారిటీ సభ్యుల మాటే చెల్లుబాటు అవుతుంది. కమిషన్ సభ్యులు.. నియోజకవర్గాల విభజనలో భౌగోళిక సామీప్యత, పరిపాలన సౌలభ్యం, ప్రజా రవాణాను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిపాదనలను గెజిట్‌లో ప్రచురించాక, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. దీనికోసం బహిరంగ విచారణలు నిర్వహిస్తారు. కమిషన్ ఇచ్చే తుది ఉత్తర్వులకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది. గెజిట్‌లో ప్రచురించిన తర్వాత వీటిని ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీలుండదు. అయితే, కొత్త ఉత్తర్వులు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న సభలు రద్దయ్యే వరకు పాత నియోజకవర్గాలే కొనసాగుతాయి. మధ్యలో వచ్చే ఉప ఎన్నికలు కూడా పాత పద్థతిలోనే జరుగుతాయి. ముద్రణ దోషాలు, జిల్లాల పేర్లు మారినప్పుడు అవసరమైన చిన్నపాటి సవరణలు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. నియోజకవర్గ సరిహద్దులను మాత్రం మార్చకూడదు. పునర్విభజన వ్యవహారాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర చట్టాల కంటే, ఈ కొత్త చట్టానికే సర్వాధికారాలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. ఇప్పటివరకు అమలులో ఉన్న ‘నియోజకవర్గాల పునర్విభజన చట్టం, 2002’ రద్దవుతుంది.
కఠిన నిబంధనలు..
నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేటప్పుడు కమిషన్ కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే.. అసెంబ్లీ-పార్లమెంటు అనుసంధానం కోసం బిల్లులో ఒక కీలక అంశాన్ని పొందుపరిచారు. అదేంటంటే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చేలా చూడాలి. ఒకే ఎమ్మెల్యే సీటు రెండు ఎంపీ సీట్లలోకి రాకూడదు. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న చోట రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్టీల విషయంలో వారి జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం పేర్కొంది.