Share News

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు

ABN , Publish Date - May 11 , 2026 | 07:11 PM

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు
AP Rain Alert

అమరావతి, మే11 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర శ్రీలంక తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు, రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


బలపడనున్న అల్పపీడనం..

విపత్తు నిర్వహణ శాఖ ప్రకారం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు (మంగళవారం) శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తీరప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.


పిడుగుల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి

పిడుగుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించారు. ఉరుముల శబ్దాలు వినిపించిన వెంటనే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. అలాగే పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద ఆశ్రయం పొందడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఉరుముల శబ్దాలు వినిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.


అల్లూరి, పోలవరం జిల్లాలకు హీట్ అలర్ట్..

వర్ష సూచనలతో పాటు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, చింతూరు, కూనవరం మండలాల్లో హీట్ అలర్ట్ అమల్లో ఉందని అధికారులు వెల్లడించారు.


రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ తూర్పులో అత్యధికంగా 42.3°C నమోదు, కుక్కునూరు, కూనవరం ల 42.1°C, మంత్రాలయంలో 41.5°C, కొప్పెరపాడులో 41.4°C, కడపలో 41.3°C, తాడేపల్లిలో 41.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


రైతులు, పశుకాపరులకు ప్రత్యేక సూచనలు

వడగాలులు, పిడుగుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పశువులను చెట్ల కింద కట్టేయకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. వ్యవసాయ పనులను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా ఉండడం అవసరమని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 08:48 PM