భూ భారతి రిజిస్ట్రేషన్లకు మోక్షం ఎన్నడు?
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:31 AM
స్లాట్ బుక్ చేసుకున్నాం.. సర్కారుకు చెల్లించాల్సిన చలాన్ల డబ్బులు ముందే కట్టాం.. అయినా రోజుల తరబడి తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలా? అని రైతులు, భూ కొనుగోలుదారులు అధికారులను నిలదీస్తున్నారు.
అధికారుల సమన్వయ లోపంతో సేవల స్తంభన
జూనియర్ అసిస్టెంట్లకు అందని లాగిన్లు
హనుమకొండ: స్లాట్ బుక్ చేసుకున్నాం.. సర్కారుకు చెల్లించాల్సిన చలాన్ల డబ్బులు ముందే కట్టాం.. అయినా రోజుల తరబడి తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలా? అని రైతులు, భూ కొనుగోలుదారులు అధికారులను నిలదీస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో వేలేరు, పరకాల, కమలాపూర్, దామెర, ఐనవోలు, కాజీపేటలో భూ భారతి రిజిస్ర్టేషన్ల నిలిపివేత వెనుక కలెక్టరేట్ డి-సెక్షన్ సూపరింటెండెంట్ నాగరాజు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లిన వారు పనులను వదులుకొని వారం రోజులుగా రిజిస్ర్టేషన్ కోసం జిల్లాలో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25 నుంచి 31 తేదీ సోమవారం వరకు పూర్తిగా రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదేమి అలసత్వం?
పాత ఆపరేటర్లను విధుల నుంచి తొలగించిన అధికారులు, పోర్టల్‌లో వారి లాగిన్ ఐడీలను డిసేబుల్ చేయడంలో ఎందుకు ఆసల్యం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్త సిబ్బందికి ప్రత్యేక లాగిన్ ఐడీలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకని మండిపడుతున్నారు. పర్యవేక్షణ లోపంతో సాంకేతిక చిక్కులు తలెత్తుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్పిడి, కుటుంబ హక్కుల బదిలీ, వారసత్వ నమోదు, గిఫ్ట్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్స్ వంటి అత్యవసర రిజిస్ర్టేషన్లు ఆగిపోవడంతో వందలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే రైతుల ఆవేదన అధికారులకు పట్టడం లేదా.. అని ప్రశ్నిస్తున్నారు.
సీనియారిటీకి నీళ్లు..
భూ భారతి ఆపరేటర్ల కొనసాగింపులో సీనియారిటీ ప్రకారం మొదటి ఏడుగురు ఆపరేటర్లే విధులు నిర్వహించాల్సి ఉందని డి-సెక్షన్ సూపరింటెండెంట్ నాగరాజు స్పష్టం చేశారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి సీనియారిటీ నిబంధనలను విస్మరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీనియారిటీ జాబితాలో 11వ స్థానంలో ఉన్న ఒక ఆపరేటర్‌ను నిబంధనలకు విరుద్ధంగా 7వ స్థానంలోకి చేర్చి విధుల్లోకి తీసుకున్నట్లు పలువురు ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.
11వ స్థానంలో ఉన్న వ్యక్తికి లబ్ధి చేకూర్చే క్రమంలో అతడి కంటే సీనియర్ అయిన వేలేరు తహసీల్దార్ కార్యాలయం భూ భారతి ఆపరేటర్‌ను అన్యాయంగా తొలగించే కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ఉన్న ఆపరేటర్‌ను పక్కనబెట్టి, వెనుక ఉన్న వ్యక్తిని ముందుకు తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అడ్మినిస్ర్టేటివ్ పొరపాట్లు, అధికారుల సమన్వయ లోపంతో నెలకొన్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News