తెనాలిలో వ్యాపారి కిడ్నాప్.. ఆపై దారుణ హత్య..!
ABN , Publish Date - Sep 02 , 2026 | 10:02 AM
గుంటూరు జిల్లా తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సుపారీ ఇచ్చి భయపెట్టేందుకు చేసిన వ్యవహారం చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గుంటూరు, సెప్టెంబర్ 2: జిల్లాలోని తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చెక్కపాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్న కోటి లింగయ్యను ఆగస్టు 29న సోమసుందరపాలెం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కోటి లింగయ్య కనిపించడం లేదంటూ ఆయనతో సహజీవనం చేస్తున్న దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ ఘటనను కొందరు ప్రత్యక్ష సాక్షులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. దీప్తితో కోటి లింగయ్య సహజీవనం చేస్తున్న విషయం ఇంట్లో తెలియడంతో ఆయనకు భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే కోటి లింగయ్యను భయపెట్టేందుకు ఆయన బావమరిది రాజేష్ సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భట్టిప్రోలు మండలం ఓలేరు ప్రాంతానికి చెందిన నలుగురితో రాజేష్ సుపారీ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు 29న కారులో వచ్చిన సుపారీ గ్యాంగ్ కోటి లింగయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం కారులోనే ఆయనను తీవ్రంగా కొట్టడంతో గాయాల కారణంగా మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కోటి లింగయ్య మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం ఆయన బావమరిది రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిడ్నాప్ వెనుక అసలు కారణం ఏమిటి, ఇందులో ఎంతమంది ప్రమేయం ఉంది, వ్యాపారిని ఎక్కడికి తీసుకెళ్లారు.. అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోటి లింగయ్య మృతదేహం కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!