స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఫణం..
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:10 AM
రజాకారుల పాశవిక దాడికి పరకాలలో 15 మంది సమరయోధులు అమరులైన ఉదంతానికి నేటితో (సెప్టెంబరు 2) 75 ఏళ్లు పూర్తయ్యాయి.
పరకాల నెత్తుటి త్యాగానికి 75 ఏళ్లు
రజాకార్ల దాడుల్లో నేలకొరిగిన యోధులు
మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా ప్రసిద్ధి
పరకాల(వరంగల్): రజాకారుల పాశవిక దాడికి పరకాలలో 15 మంది సమరయోధులు అమరులైన ఉదంతానికి నేటితో (సెప్టెంబరు 2) 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చెంది ఆగస్టు 15 స్వేచ్ఛా స్వాతంత్య్రం పొందితే.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించలేదు.
స్వేచ్ఛా స్వాంతంత్య్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమం వైపు ఉరుకులు తీశారు. ప్రజా సంఘాలు, సాయుధ బలగాలను ఏర్పా టు చేసుకుని సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. నిజాం సర్కారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరిట ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది.
వీరు ఉద్యమకారులను, సానుభూతిపరుల కుటుంబాలను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. రజాకారుల చర్యలను ఎదుర్కొనేందు కు సమరయోధులు సాయుధబాట పట్టారు. పరకా ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కటంగూరి కేశవరెడ్డి, ప్రకా్‌షరెడ్డి, ఎస్.మనోహర్‌రావు, కటంగూరి నర్సింహరెడ్డి, వీరగోపాల్‌రావు, చాడ వాసుదేవరెడ్డి, బల్గూరి బుచ్చయ్య, తోపునూరి కోటయ్య, కందుకూ రి జోగారెడ్డి, మేడిపల్లి మల్లయ్య, పాడి నర్సింహారెడ్డి, చంద్రయ్య, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి పోరాటయోధులు ఒక్కొక్క విభాగానికి నాయకత్వం తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
1947 సెప్టెంబరు 2న పరకాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి పరకాల ప్రాంతంలోని ప్రతీ గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని చాపలబండ వద్దకు చేరుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పరకాలప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచాలని అప్ప టికే పధకం ప్రకారం నిజాంసేనలు మాటువేసి ఉన్నాయి. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వరకు ప్రజలు చేరగానే రజాకార్ మూకలు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను వెంబడించి ఊచకోత కోయగా, నిజాం ఆధీనంలోని పోలీసులు తుపాకులతో విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 15 మంది సమరయోధులు అమరులవగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
అమరవీరుల స్మారకార్థం మందిరం
నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం పరకాలలో అమరవీరుల మైదానం ఏర్పాటు చేసి అమరఽధామాన్ని నిర్మించారు. రంగాపురం సంఘటనకు సాక్ష్యంగా నిలిచే అమరుల చిత్రాలను అమరధామంపై ఏర్పాటు చేశారు. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు సొంత ఖర్చులతో ఈ ధామాన్ని నిర్మించారు. పరకాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, మేధావులు తప్పకుండా అమరధామాన్ని సందర్శిస్తుంటారు. కాగా, ప్రతీ ఏటా సెప్టెంబరు 2న అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోఽధులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అమరులకు నివాళులు అర్పిస్తుంటారు. ఇదిలావుండగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరధామం రోజురోజుకూ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఉద్యమకారుల విగ్రహాలు చేతులు ఊడిపోయి అమరధామంలో పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.
అమరులైన సమరయోధులు
పరకాలలో జరిగిన నాటి ఉదంతంలో ప్రాణాలు ఒదిలిన సమరయోధుల వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కేదారి, పోతుకంటి పెద్దులు, గజ్జి పర్వతాలు, ఆముదాపురం వీరన్న, మేకల పోచయ్య, బత్తుల సమ్మయ్య, దాచపెల్లి రాజయ్య, గుండారపు కొమురయ్య, తొణగరి పూర్ణసింగ్, జాలిగపు మైసయ్య, అలువల అంకూస్, గిన్నె కట్టమల్లు, కుంట అయిలయ్య తదితరులు రజాకారుల కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో రెచ్చిపోయిన రజాకారు మూకలు ఉద్యమకారులను సజీవంగా పట్టుకుని కిరాతకంగా చంపారు. గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య, వర్దెల్లి వీరయ్య, రాజ్‌మహ్మద్‌లను చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా నరికి కాల్పులు జరిపి హతమార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News