Share News

ఇక.. రయ్‌.. రయ్‌..

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:49 PM

ఓరుగల్లుకు మరో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రాబోతోంది. వరంగల్‌- కరీంనగర్‌ మధ్య ప్రయాణానికి నేషనల్‌ హైవే 563 పనులు దాదాపు పూర్తయ్యాయి.

ఇక.. రయ్‌.. రయ్‌..
Warangal Karimnagar Highway

  • వరంగల్‌ - కరీంనగర్‌ జాతీయ రహదారి - 563 పూర్తి

  • దసరా నాటికి ప్రధానితో వర్చువల్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు

  • రూ.1,641కోట్లతో నాలుగు వరుసలుగా 68.015 కి.మీ. నిర్మాణం

  • సొలార్‌ లైట్లు, సీసీ కెమెరాలు, అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు

  • గంటలోపే ప్రయాణం.. సగం సమయం ఆదా..

  • సక్సెస్‌ఫుల్‌గా ట్రయల్‌ పూర్తి చేసిన అధికారులు

  • త్వరలో కొత్తగట్టు వద్ద టోల్‌గేట్‌ ప్రారంభం

  • ఓరుగల్లుకు ఎకనమికల్‌ కారిడార్‌గా హైవే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

ఓరుగల్లుకు మరో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రాబోతోంది. వరంగల్‌- కరీంనగర్‌ మధ్య ప్రయాణానికి నేషనల్‌ హైవే 563 పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.1,641కోట్ల వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మించిన జాతీయ రహదారిపై ప్రస్తుతం ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. అత్యాధునిక ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ, సీసీ కెమెరాలు, సోలార్‌ హైమాస్ట్‌ లైటింగ్‌, మెరుగైన జంక్షన్‌లు, భద్రతా ప్రమాణాలతో రూపొం దించిన ఈ హైవే అక్టోబరు రెండో వారంలో వరంగల్‌ ప్రజలకు అధికారికంగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వరంగల్‌- కరీంనగర్‌ మధ్య ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గడమే కాకుండా, ఉత్తర తెలంగాణలో రవాణా, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు కొత్త ఊపు లభించనుంది.


ఓరుగల్లుకు మరో కొత్త హైవే

మహానగరానికి మరో కొత్త హైవే పట్టాలెక్కనుం ది. రాష్ట్రంలో టైర్‌-2 సిటీస్‌గా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌-కరీంనగర్‌ల మధ్య నిర్మించిన ఈ హైవే పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభు త్వం భారతమాల పరియోజన పథకం కింద రూ. 2,146.86కోట్ల నిధులు కేటాయించింది. భూసేకరణ, చెట్ల తొలగింపు, విద్యుత్‌ స్తంభాల మార్పిడి తదితర వాటికి రూ.505.86కోట్లు కేటాయించగా, మరో రూ. 1,641కోట్లతో 68.015 కిలో మీటర్ల పరిధిలో ఎన్‌ హెచ్‌-563 రహదారిని నిర్మించారు. ఈ హైవే కరీంన గర్‌ జిల్లా పరిధిలో 46.24 కిలో మీటర్లు, హనుమ కొండ జిల్లా పరిధిలో 21.77కి.మీలు విస్తరించింది.


ఈ కొత్త నాలుగు లైన్ల రహదారి పూర్తయితే వరం గల్‌ నుంచి కరీంనగర్‌కు గంటన్నర చేసే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉంది. ఈ హైవేను హనుమకొండ జిల్లా పలివేల్పుల సమీపంలోని హైద రాబాద్‌- భూపాలపట్నం జాతీయ రహదారి 163 వద్ద ప్రారంభమై గుం టూరుపల్లి, ఎర్రగట్టు గుట్ట, హసన్‌ప ర్తి, ఎల్లాపూర్‌, ఎల్కతుర్తి, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, కేశవ పట్నం మీదుగా మానుకొండూరు బైపాస్‌ వర కు నిర్మించారు. మొత్తం 23 వెహికల్‌ అండర్‌ పాస్‌ లు, 121 బాక్స్‌ కల్వర్టు లు, 13 చిన్న వంతెనలు, రెండు పెద్ద వంతెనలు, 2 ఫ్లై ఓవర్లు నిర్మించారు.


ఈ హైవే పనులు తుది దశకు చేరుకో వడంతో సెప్టెంబరు 5వ తేదీ నుంచి ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. అక్టోబరు మొ దటి లేదా రెండో వారంలో అఽధికా రికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్‌ సమీపం లోని కొత్త గట్టు వద్ద టోల్‌గేట్‌ ఏర్పా టు చేశారు. పనులన్నీ దసరా నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్రమో దీ చేతుల మీదుగా వర్చువల్‌గా ఈ జాతీయ రహదారి 563ని ప్రారంభిం చేందుకు నేషనల్‌ హైవే అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


hnk2.jpgఅత్యాధునిక టెక్నాలేజితో పర్యవేక్షణ

వరంగల్‌- కరీంనగర్‌ పట్టణాలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ఈ హైవే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఏటీఎంఎ్‌స) ను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీల కెమెరాను అమర్చి, కేంద్రీకృత నిఘా సెంటర్‌ నుంచి ట్రాఫిక్‌ సరళిని పర్యవేక్షించనున్నారు. హైవేపై ఏదైనా ప్రమాదం, ట్రాఫిక్‌ జామ్‌ జరిగితే డిజిటల్‌ బోర్డుల ద్వారా వేరియబుల్‌ మెసేజ్‌ సైన్స్‌ (వీఎంఎస్‌) ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాటు చేశారు. 1033 హెల్ప్‌లైన్‌ నెంబరు, నిరంతరం హైవేపై తిరిగే రూట్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌లు, క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా హైవేపై 25చోట్ల వర్షపు నీటిని ఇంకించేలా నిర్మాణాలు చేపట్టారు. కానుగతో పాటు స్థానిక జాతుల పూల మొక్కలు, రహదారి మధ్యలో, ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఆయా మొక్కలకు నీటిని అం దించేందుకు ఎక్కడిక్కడ నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు.


ఇబ్బందులు..

ఈ కొత్త హైవేతో సమీప గ్రామాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యి. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లి, కొత్తగట్టు గ్రామాల వద్ద గ్రీన్‌ కారిడార్‌, అండర్‌పాస్‌ నిర్మాణాలు చేపట్టలేదు. రహదారికి సమాంతరంగా సర్వీసు రోడ్డు నిర్మించినప్పటికీ రోడ్డు దాటేందుకు ప్రజలకు అవకాశం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి హుజూరాబాద్‌ అండర్‌పాస్‌ నుంచి తిరిగి రావాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. అలాగే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం, కోతులనడుమ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఇటు నుంచి అటు వెళ్లాలంటే అండర్‌ పాస్‌లు లేకపోవడంతో కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి తిరిగి రావాల్సి వస్తోందని ఆందోళనలో స్థానికులు ఉన్నారు.


ఎకనమికల్‌ కారిడార్‌గా న్యూ హైవే..

ఈ కొత్త హైవేతో వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృదిఽ్ధకి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. కరీంనగర్‌లోని గ్రానైట్‌ పరిశ్రమలు, నిర్మాణరంగానికి అవసరమైన ముడి సరుకుల రవాణా సులభం కానుంది. వరంగల్‌లోని టెక్స్‌టైల్‌ పార్కుకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతం కానుండటంతో రైతులకు ప్రయోజనం కలుగనుంది. హైవే వెం బడి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.


రెండు జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు భక్తులు, పర్యాటకులు పెరుగనున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్‌ వాసులకు మామునూరు ఎయిర్‌పోర్టు మరింత చేరువకానుంది. దీంతో ఈ హైవే ఎకనామికల్‌ కారిడార్‌గా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఇదే రహదారితో సిద్ధిపేట-ఎల్కతుర్తి హైవే -765 డీజీ అనుసంధానం కానుంది. రూ.579 కోట్లతో 64 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తున్నారు. దీంతో సిద్ధిపేట, హుస్నాబాద్‌ల మీదుగా ఎల్కతుర్తి వద్ద వరంగల్‌- కరీంనగర్‌ హైవేతో ఈరహదారి అనుసంధానం కానుంది. దీంతో సిద్ధిపేటకు వరంగల్‌తో పాటు కరీంనగర్‌కు కూడా కనెక్టివిటీ పెరుగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 12:49 PM