ప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:25 AM
సుశిక్షితులైన సిబ్బంది ప్రాముఖ్యం ఎంతటిదో చెప్పిన ఫ్లైదుబాయ్ హీరో పైలట్ స్మిత్ మచ్చార్ పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమాన ప్రయాణికులను విపత్తు నుంచి కాపాడిన పైలట్ స్మిత్ మచ్చార్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. దుబాయ్-టెల్ అవీవ్ విమానం కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడ్డప్పటికీ లెక్క చేయని కెప్టెన్ స్మిత్ మచ్చార్ కాక్‌పిట్ తలుపులు తెరిచి నిందితుడి ప్లాన్స్‌ను భగ్నం చేయగలిగారు. అధిక శాతం మంది ఇజ్రాయెలీలు ఉన్న ప్లేన్‌ను హైజాక్ చేసేందుకే స్మిత్‌పై కోపైలట్ దాడి చేశాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సుశిక్షితులైన విమాన సిబ్బంది ప్రాముఖ్యత గురించి కొంతకాలం క్రితం పైలట్ స్మిత్ చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కొంతకాలం క్రితం స్మిత్ ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వృత్తిపరమైన సవాళ్ల గురించి చెప్పారు. ‘ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులకు అనారోగ్య సమస్య తలెత్తితే ఏం జరుగుతోందో ఊహించండి. ఆ సమయంలో విమానంలో డాక్టర్ ఉంటే అదృష్టమే. లేదంటే సుశిక్షితులైన విమాన సిబ్బందే ప్రయాణికుల్ని కాపాడగలరు. వారేమీ సర్జరీలు చేస్తారని నేను చెప్పడం లేదు కానీ ఆ సమయంలో తగిన రీతిలో స్పందించేందుకు అవసరమైన శిక్షణ వారికి ఉంటుంది. విమాన సిబ్బంది విషయంలో కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉండటం నిజంగా దురదృష్టకరం. కానీ ఆపద సమయాల్లో ప్రయాణికుల్ని కాపాడేది వారే’ అని స్మిత్ నాటి పాడ్ కాస్ట్‌లో వివరించారు.
నాటి మాటలు ఎంత నిజమో తాజా ఉదంతంలో తేలడంతో ఆ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. పెను ప్రమాదంలో ఉన్న కెప్టెన్ స్మిత్‌కు ఆ శిక్షణే అక్కరకు వచ్చింది. కోపైలట్ దాడిలో గాయపడినప్పటికీ ఆయన తన శక్తినంతా కూడదదీసుకుని కాక్‌పిట్ తలుపులు తెరవగలిగారు. ఈ విషయాలను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, కాక్‌పిట్ తలుపులు తెరిచి ప్రయాణికుల్ని అప్రమత్తం చేయాలన్న విషయాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆయన నిజంగానే హీరో’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన విషయాల్ని షేర్ చేశారు.
కోపైలట్‌ను నిర్బంధించిన అనంతరం విమానం తబూక్ (సౌదీ అరేబియా)లో సురక్షితంగా ల్యాండైంది ప్రమాదసమయంలో విమానంలోనే ఉన్న మరో ఆఫ్ డ్యూటీ పైలట్ సేఫ్‌గా ప్లేన్‌ను ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కెప్టెన్ స్మిత్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
కాక్‌పిట్‌లో దాడితో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్
ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ప్రయాణికుడికి నెతన్యాహు ప్రశంసలు