Share News

కూరగాయల సాగు.. లాభాలు బాగు

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:45 AM

వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి విధానమే శరణ్యమని ఓ రైతు కుటుంబం భావించింది.

కూరగాయల సాగు.. లాభాలు బాగు
Vegetable Farming

  • తగ్గిన వర్షపాతంతో పెరిగిన దిగుబడి

  • ఆదర్శంగా నిలుస్తున్న కల్వల రైతులు

మహబూబాబాద్‌: వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి విధానమే శరణ్యమని ఓ రైతు కుటుంబం భావించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా ఉండవని, కూరగాయలు పండించడంతో పాటు.. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, జిల్లా అధికారుల సూచనలతో కూరగాయలు సాగు చేస్తున్నారు కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన ఘంటా మాధవి-అశోక్‌రెడ్డి రైతు దంపతులు. వీరే కాకుండా బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్‌ ఇతర మండలాల గ్రామాల్లోని రైతులూ కూరగాయలు పండించేందుకు మొగ్గుచూపుతున్నారు.


17 ఎకరాలలో..

కల్వల గ్రామానికి చెందిన ఘంటా మాధవి-అశోక్‌రెడ్డిలకు 9 ఎకరాల సొంత భూమితో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో కూరగాయల సాగుకు నడుంబిగించారు. పత్తి, పసుపు, వరితో పాటు మూడెకరాల్లో బీరకాయ, రెండున్నర ఎకరాల్లో కాకరకాయ, 30 గుంటల్లో టమాట, 10 గుంటల్లో క్యాబేజీ, మరో 30 గుంటల్లో బంతిపూల తోటను సాగు చేశారు. 10 గుంటల్లో బోడ కాకరకాయ వేయగా అది మొలకెత్తలేదు.


hnk2.jpgమిగతా పంటలు మొలకెత్తాయి. విత్తనాల కొనుగోళ్లతో పాటు పండ్లకు వేసే తాత్కాలిక పందిళ్లను వేసి డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకుని మల్చింగ్‌ పేపర్‌తో గత 75 రోజుల క్రితం కూరగాయల సాగును మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ తీసుకోకుండా రూ.8 లక్షల వరకు ఖర్చుల కింద పెట్టుబడులయ్యాయి. ఇప్పటి వరకు 15 సార్లు పంటల దిగుబడి వచ్చింది. 13 టన్నుల బీరకాయ, 7 టన్నుల వరకు కాకరకాయ దిగుబడులు వచ్చాయి.


మహబూబాబాద్‌, వరంగల్‌ లాంటి మార్కెట్లకు ఈ కూరగాయలను తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. దాంతో ఇప్పటి వరకు పంటలపై పెట్టిన పెట్టుబడులు పోను రూ.6 లక్షల వరకు నికర ఆదాయం సాధించారు. టమాట నారు మాత్రం కర్నూల్‌జిల్లా నుంచి రూ.3 మొక్క చొప్పున ఇక్కడికి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం టమాట కాయ దశలో ఉంది. బంతిపూలు కూడా పూలు పూస్తున్నాయి.


hnk2.3.jpgరబీ సీజన్‌ వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. పెంట, రెడీమెడ్‌ సేంద్రీయ ఎరువులు తీసుకువచ్చి కూరగాయలు సాగు చేస్తుండడంతో దిగుబడి బాగానే వస్తుందని చెబుతున్నారు. వచ్చేనెల రోజుల్లో టమాటపై ఆదాయం వస్తుందని ఆ రైతు అశోక్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం రైతులను ప్రోత్సహించి మరిన్ని పంటలు సాగు చేసే విధంగా కృషి చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 11:46 AM