విద్యుత్ శాఖపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పెరిగిన డిమాండ్: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:09 AM
విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్లు అధికంగా డిమాండ్ ఉందని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 17: విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని అన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని అన్నారు. వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు.
ప్రజలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 20 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరిగిందని మంత్రి అన్నారు. డిమాండ్‌ను బట్టి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం అన్ని రాష్ట్రాల్లో ఉందని.. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు. పగటిపూట సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల్లో నిల్వ చేసి, పీక్ అవర్స్‌లో వినియోగించుకోవాలన్నది తమ ఆలోచనగా తెలిపారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా సామర్థ్యాన్ని పెంచుకుంటామని అన్నారు. 5,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News