Share News

ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన: సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 17 , 2026 | 10:39 AM

నిరంకుశ పాలనపై పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ నేల ఎప్పటికప్పుడు ప్రజాచైతన్యాన్ని రగిలించిందన్నారు.

ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడినవారికి ఘన నివాళులర్పించారు. నిరంకుశ పాలనపై పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ నేల ఎప్పటికప్పుడు ప్రజాచైతన్యాన్ని రగిలించిందన్నారు. సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిందని గుర్తుచేశారు. అదే సమయంలో దోపిడీ, వెట్టిచాకిరి, అణచివేతలు పెరిగాయని తెలిపారు. చివరిదశలో రజాకారుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయన్నారు.


1948 సెప్టెంబర్ 17న సైనిక చర్యతో భారత్‌లో హైదరాబాద్ విలీనమైందని సీఎం వెల్లడించారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడటమన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేశామని.. దీని ద్వారా 25.35 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధిచేకూరినట్లు చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి 32 నెలల్లో రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపామని వెల్లడించారు.


దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని.. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.38,595 కోట్లతో 122.9 కి.మీ. మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 55 కి.మీ. పరిధిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరిస్తామని అన్నారు. ‘చరిత్రను మరిచిపోం.. చరిత్ర దగ్గరే ఆగిపోం. పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ.. ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఏసీబీ

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 11:01 AM