Share News

భూవివాదం.. శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:27 AM

దివంగత నటి శ్రీదేవికి చెందిన ఆస్తి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 1988లో శ్రీదేవికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ కూతురు ఎంసీ శివగామి, కుమారుడు ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

భూవివాదం.. శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఇంటర్‌నెట్ డెస్క్: దివంగత నటి శ్రీదేవికి చెందిన ఆస్తి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 1988లో శ్రీదేవికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ కూతురు ఎంసీ శివగామి, కుమారుడు ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బోనీ, జాహ్నవి, ఖుషీకి వ్యతిరేకంగా గతంలో తాము వేసిన దావాను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిందని శివగామి తెలిపారు. తర్వాతి విచారణ వరకు ఆ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమిస్తామని బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.


ఏంటి వివాదం?

చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని షోలింగనల్లూరులో సర్వే నంబర్ 1/1బీలో ఉన్న వివాదాస్పద భూమిలో తమకూ వాటా ఉందని ఎంసీ చంద్రశేఖర్ పిల్లలు ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ గతంలో ట్రయల్ కోర్టులో కేసు వేశారు. కేసును ట్రయల్ కోర్టు.. మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. తాము చంద్రశేఖర్ వారసులమేనని, ఆయన తమ కన్న తండ్రి అని పిటిషనర్లు మద్రాస్ హైకోర్టుకు వెల్లడించారు. ఆ వివాదాస్పద భూమిని ఐదు సమాన భాగాలుగా విభజించాలని, అందులో 1/5వ వంతు వాటా తమకు కేటాయించాలని కోరారు. అలాగే, 1988 ఏప్రిల్ 19న రాజేశ్వరి, శ్రీలత, శ్రీదేవికి అనుకూలంగా అమలు చేసిన సేల్ డీడ్లను రద్దు చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. అయితే, పిటిషనర్లు వేసిన దావా గడువు ముగిసిపోయిందని, కాబట్టి ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


పిటిషన్ గడువు తీరిపోయింది: కపూర్ కుటుంబం

పిటిషనర్లు వేసిన దావాకు చట్టబద్ధత లేదని కపూర్ కుటుంబం తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ‘ఆస్తిని ఎప్పుడో 1988లో శ్రీదేవి కుటుంబానికి విక్రయించారు. పిటిషనర్లు 2025 ఏప్రిల్ 20న ఆ దావా వేశారు. అంతేకాకుండా శ్రీదేవి మరణం తర్వాత 2023లో ఆస్తి మ్యుటేషన్ కోసం నా క్లైంట్లు దరఖాస్తు చేశారు. ఆస్తి మ్యుటేషన్ కోసం నా క్లైంట్లు దరఖాస్తు చేసుకున్న తర్వాతే పిటిషనర్లు కేసు వేశారు’ అని అభిషేక్ వాదించారు.


Also Read:

డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్‌ కారులో చెలరేగిన మంటలు..

ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన: సీఎం రేవంత్

Updated Date - Sep 17 , 2026 | 11:44 AM