నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు
ABN , Publish Date - Sep 17 , 2026 | 09:54 AM
‘‘1948, సెప్టెంబరు 17... నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు. రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు. రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాల్లోని మువ్వన్నెల జెండా స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు.
సెప్టెంబరు 17, 1948న తెలంగాణకు స్వాతంత్య్రం
ఎంతో మంది పోరాటాలు, త్యాగాలకు దక్కిన ఫలితం
‘‘1948, సెప్టెంబరు 17... నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు. రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు. రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాల్లోని మువ్వన్నెల జెండా స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. ఈ నేలపై త్రివర్ణపతాకం ఎగిరిన రోజు.! అంతటి ఘన చరిత్ర కలిగిన ఇదే రోజు ఇప్పుడు అత్యంత వివాదాస్పదం. ఈ నేపథ్యంలో నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో అనుబంధం కలిగిన కొందరి అభిప్రాయాలతో!
నిజాం వ్యతిరేక పోరాటానికి తుపాకులు అందించా: మొహ్మద్ ఖాజా మొయినుద్దీన్, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు
(హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి): మాది దేశ్‌ముఖ్‌ల కుటుంబం. సిద్దిపేట పరిసరాల్లోని కొన్ని గ్రామాలకు మా నాన్న జాగిర్దార్. నన్ను మంచిగా చదివించాలని పాత నగరంలోని చార్మినార్ దగ్గర దారుల్షిఫా స్కూల్‌లో నన్ను చేర్పించారు. మా స్కూలు ప్రధానోపాధ్యాయుడు నూరుల్‌హాసన్ సామ్యవాది. తరగతి గదిలో మాకు ఆయన పాఠ్యాంశాలతో పాటు సామాజిక విషయాలను బోధించేవారు. ఆయన ప్రభావంతో నేనూ సామ్యవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాను. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌కు సిటీ కార్యదర్శిగా 1947లో ఎంపికయ్యాను. అదే సమయంలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మందుగుండు సామగ్రి, తుపాకులు రహస్యంగా చేరవేసేవాడిని.
రజాకార్లు అంటే భూస్వామ్య వ్యవస్థని కాపాడేందుకు పుట్టిన సైనిక సంస్థ. గుండారం కిష్టారెడ్డి, ధర్మారెడ్డి లాంటి దొరలెంతో మంది ఆ సంస్థను పెంచి పోషించారు. జాగిర్దారీ కుటుంబ నేపథ్యమైనా, నేను రెండు సార్లు రజాకార్ల దగ్గర ఆయుధాలను దొంగిలించి మరీ వాటిని నా కమ్యూనిస్టు మిత్రులకు అందించాను. అది తెలిసి నా మీద నిజాం పోలీసులు కక్ష కట్టారు. దాంతో ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి ప్రాంతాల్లో కొన్నాళ్లు రహస్య జీవితం గడిపాను. బ్రిటిష్ పాలకులకు తొత్తుగా వ్యవహరించిన నిజాంలు అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే నిజాం వ్యతిరేక ఉద్యమంలో నేనూ భాగమయ్యాను.
పోరాటంలో కొరియర్‌గా పనిచేశా: అవ్దీశ్రాణి
‘సెప్టెంబరు 17, 1948 నాడు సాయంత్రం 5గంటలప్పుడు గౌలీపురాలోని మా గల్లీ అంతా జనంతో కిక్కిరిసింది. అక్కడ అంతమంది గుమిగూడినా గుండుసూది కిందపడినా వినిపించేంతటి నిశ్శబ్దం. వారందరి చెవులూ మా ఇంటి గుమ్మానికి వేలాడదీసిన రేడియో వైపే ఉంచారు. అప్పుడు నా వయస్సు ఎనిమిదేళ్లు. ‘అస్‌ఫజాహీ వంశానికి ప్రతీకైన కరవాలాన్ని జనరల్ చౌదరికి ఏడో నిజాం కుమారుడు ఆజం జా అప్పగించారు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది’ అంటూ దక్కన్ రేడియో ప్రయోక్త జఫ్రూల్ హసన్ ఉర్దూలో ప్రకటించారు.
ఆ వెంటనే జ్యోతికా రాయ్ పాడిన ‘పగ్ ఘున్‌గ్రూ బంద్ మీరా’ అనే మీరాబాయి భజన్ ప్రసారం చేసినట్టు నాకు బాగా గుర్తు. మా అన్నయ్య రాజ్ బహదూర్‌గౌర్ కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపకులలో ఒకరు. అలా 1947, దీపావళి రోజు జావేద్ రజ్వీ, మగ్దూంతో పాటు ఇంకొందరు కార్యకర్తలు రహస్యంగా మా ఇంటికి భోజనానికి వచ్చారు. వాళ్లు ఉన్న గదిలోకి ఇతరులు వెళ్లకుండా నన్ను కాపలా ఉంచారు. అప్పుడు మా ఇంటికి పోలీసు అధికారి కిషన్‌లాల్ అని మా బంధువు వచ్చాడు. అతను ఆ గదివైపు వెళ్లకుండా చేయగలిగాను. ఒక్కతినే నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ అజ్ఞాతంలోని కార్యకర్తలకు భోజనాలు, కరపత్రాలు చేరవేసిన సందర్భాలెన్నో!
ఆ గ్రంథాలయమే మా రహస్య స్థావరం: నూతి శంకరరావు, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావాలని ఉద్యమించినవారిలో నేనూ ఒకరిని. అప్పుడు నేను కేశవ్‌మెమోరియల్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాను. స్కూల్ మానేసి పూర్తిగా పోరాటానికి అంకితమయ్యాను. ఆబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌లో విద్యార్థులమంతా సమావేశమయ్యాం. తద్వారా ఒక పోరాట యాక్షన్ కమిటీ ఏర్పడింది. సుల్తాన్ బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో రహస్యంగా విద్యార్థులమంతా కలిసేవాళ్లం. ఒక బృందం రెడ్డి హాస్టల్ నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరితే, భాషానిలయం పక్క గల్లీలో నుంచి మరొక జట్టు వచ్చి చేరేది.
అంతా కలిసి సుల్తాన్‌బజార్ చౌరస్తా వరకు నిజాం వ్యతిరేక నినాదాలు చేస్తూ ఊరేగింపు తీసేవాళ్లం. పోలీసులు లాఠీచార్జి చేసి మమ్మల్ని చెదరకొడితే.. వాళ్ల కళ్లుగప్పి భాషా నిలయంలో తలదాచుకునేవాళ్లం. కొత్వాల్ వెంకటరామారెడ్డి గ్రంథాలయ అధ్యక్షుడు కనుక, అందులో పోలీసులు అడుగుపెట్టేవారు కాదు. దాంతో నిజాం వ్యతిరేక విద్యార్థి ఉద్యమకారులకు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఒక పెద్ద స్థావరం. అలా 1948, మార్చి 8న విద్యార్థుల ర్యాలీని చెదరగొట్టి 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో 21 మందిని జైలుకు పంపారు. దాంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులు కూడా యువత ఆగ్రహాన్ని అణచివేయలేకపోయారు. నిజాం వ్యతిరేక పోరాటంలో నేనూ భాగమైనందుకు సంతోషిస్తున్నాను.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News