వినాయక చవితి ఖర్చు రూ. 10వేల కోట్లకు పైనే!
ABN , Publish Date - Sep 17 , 2026 | 08:15 AM
వినాయక చవితి వచ్చిందంటే చాలు భాగ్యనగరం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరతాడు.
నగరంలో లక్షన్నర మండపాలు..
అలంకరణకు రూ.150 కోట్లు
విగ్రహాలకు 100 కోట్లు.. ప్రసాదాలకు రూ. 300 కోట్లు
గణేశ్ ఉత్సవం.. ఎంతోమందికి వ్యాపార అవకాశం
శూన్య మాసంలో ఉపాధి మార్గాలు
హైదరాబాద్ సిటీ: వినాయక చవితి వచ్చిందంటే చాలు భాగ్యనగరం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరతాడు. ఆయన అలంకరణకు, పూజకు మండపాలు, లైట్లు, డీజేలు, బ్యాండ్లు, టెంట్లు, పూలు. పండ్లు, ప్రసాదాలు వంటివి ఎన్నో అవసరమే. గణేశ్ ఆగమన్‌తో మొదలయ్యే సంబురాలు నిమజ్జనం వరకూ కొనసాగుతూనే ఉంటాయి. నగర ఆర్ధిక వ్యవస్థకు జవసత్త్వాలను జోడిస్తాయి. శూన్యమాసంలో శుభకార్యాలు లేక డీలా పడిన బ్యాండుమేళాలు, టెంట్‌హౌ్‌సలు లాంటి వారికి మాత్రమే కాదు,
పురోహితులు మొదలు ఇతర వర్గాలకు సైతం గణేశుడు ఆనందానుభూతులను కలిగిస్తూనే ఉంటాడు. భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి లెక్కల్లో నగరంలో గణపతి నవరాత్రుల వేళ జరిగే వ్యాపారం రూ.6వేల కోట్లు. కానీ అనధికార లెక్కల ప్రకారం రూ.10వేల కోట్లకు పైనే ఉండొచ్చు. దేశంలో మహారాష్ట్ర తరువాత గణేశ ఉత్సవాలు హైదరాబాద్‌లోనే అత్యంత భక్తితో కోలాహలంగా జరుగుతుంటాయని, ఇక్కడ జరిగే లడ్డూ వేలం పాటలను బట్టే ఇక్కడ జరిగే వ్యాపారాన్ని అంచనా వేయొచ్చంటున్నారు పలువురు వ్యాపారులు. ఈ ఉత్సవాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్నాయి.
లంబోదరా.. లక్కు తెచ్చెరా..!
భాద్రపద మాసం అంటేనే శూన్య మాసం. ఈ రోజుల్లో వివాహాలు జరగవు. పైగా వచ్చేది శుక్రమౌడ్యమి. కారణంగా పెద్దగా ముహూర్తాలు కూడా లేవు. ఈ వివాహాలు, శుభముహూర్తాలపైన ఆధారపడిన మంగళవాయిద్యాలు, బ్యాండ్‌లు, టెంట్‌హౌ్‌సలు, కేటరింగ్ లాంటి వారందరికీ గణేశ్ నవరాత్రులు ఊపిరినిచ్చాయనే చెప్పాల్సి ఉంటుంది. ఓ అంచనా ప్రకారం లెక్కకు వచ్చిన, లెక్కకు రాని అంటే అపార్ట్‌మెంట్‌లలో కొలువు దీరిన వినాయకులతో సహా నగరంలో దాదాపు లక్షన్నర గణేశ్ మండపాలున్నాయి.
ఈ మండపాల కనీస ఖర్చు రూ.30 వేల నుంచి రూ.50 లక్షలకుపైగానే ఉంది. మరీ ముఖ్యంగా టెంట్లు, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, డీజే సౌండ్ వంటి వాటికే ఈ ఖర్చు. చాలాచోట్ల అన్నప్రసాద వితరణ కూడా జోరుగానే సాగుతుంది. నిమజ్జన సమయంలో ట్రక్కులు, లారీలు, వాయిద్యాలు, బాణాసంచా.. ఇలా ప్రతి అంశమూ లెక్కలోకి తీసుకుంటే నగరంలో ఉత్సవాల ఖర్చు కోట్లరూపాయల్లోనే ఉంటుంది. భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి అంచనాల ప్రకారం నగరంలో రూ.6వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. వాస్తవ లెక్కలు అంతకు మించే ఉంటాయంటున్నారు వ్యాపారులు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) లెక్కల ప్రకారం మహారాష్ట్ర తరువాత అంత వైభవంగా గణేశ్ ఉత్సవాలను చేసేది కరాణటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే! దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాల వేళ వ్యాపారం 45-59 వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉంటుందని కొన్ని మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్ వాటా ఎంతన్నది అధికారికంగా చెప్పకపోయినా దాదాపు రూ.10వేల కోట్లు ఉండొచ్చని వ్యాపార వర్గాల అంచనా. నిజానికి ఈ సంవత్సరం ధూల్‌పేట సహా పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల విక్రయాలే రూ.65-70 కోట్లు ఉండొచ్చని, నగర వ్యాప్తంగా తీసుకుంటే అది రూ.100కోట్లు దాటేయొచ్చన్నారు బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రకాష్ చౌదురి. మండపాల డెకరేషన్‌కు రూ.150-200 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారని, రోజువారీ నిర్వహణ ఖర్చులు, ఇతరాలను లెక్కిస్తే 6వేల నుంచి 10వేల కోట్ల రూపాయలు ఎక్కువేం కాదని అభిప్రాయపడ్డారు.
భక్తి.. భుక్తి.. బిజినెస్
భక్తితో వినాయకుని కోసం మనం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి, ప్రత్యక్షంగా మనకు కలిగించే మానసిక ఆనందం ఎలాగున్నా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధిని అందిస్తుందన్నది నిజం. ఈ గణేశ ఉత్సవాల వేళ ప్రత్యక్షంగా రెండు లక్షల మంది, పరోక్షంగా నాలుగు లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. వినాయక విగ్రహాలను తయారు చేసే కళాకారులు మొదలు, అలంకరణ, పూలు, పండ్ల విక్రయదారులు, తీన్‌మార్ వాయిద్య కళాకారులు, లైటింగ్, డెకరేషన్, టెంట్‌హౌ్‌స, కేటరర్స్, లారీల నిర్వాహకులు, ఇలా ఎంతోమందికి ఉపాధికి మార్గంగా నిలు స్తాయి. ఉత్సవాల్లో భక్తుడి చేతి నుంచి ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన నగర ఆర్ధిక వ్యవస్థలోనే తిరుగుతుంటుందని, అందుకే గణేశ ఉత్సవం భక్తి సంబురం మాత్రమే కాదని, పెద్ద వ్యాపార అవకాశం కూడా అని విశ్లేషించారు చార్టర్డ్ అకౌంటెంట్ హరికృష్ణ.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News