బాంచెన్ బతుకులు బందూకులై..
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:17 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1946-1951 మధ్య కా లంలో నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటం ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా సాగింది.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తిరగబడిన బడుగు జనం
నిజాం నిరంకుశ పాలనపై గర్జించిన సాయుధ పోరాటం
రజాకార్లకు ఎదురొడ్డిన సాయుధ జనం
విమోచన ఉద్యమంలో అగ్రభాగాన ఉమ్మడి వరంగల్
నేడు తెలంగాణ విమోచన దినం
హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1946-1951 మధ్య కా లంలో నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటం ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా సాగింది. ఇది భూసామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అధిక పన్నులు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు సాగించిన ప్రజా ఉద్యమంగా నిలిచింది. తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ చరిత్రపై ఇది గణనీయమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో చైతన్య ఉద్దీపనకు ఉత్ర్పేరకమైంది. ఈనెల 17న తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగిన విమోచన ఉద్యమం తీరు తెన్నులు, ముఖ్య ఘట్టాలపైౖ ప్రత్యేక కథనం.
నేపథ్యం
హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో దొరలు, జమీందారులు, దేశ్‌ముఖ్‌లు వంటి భూస్వామ్య వర్గాల ఆధిపత్యం ఉండేది. రైతులకుపై అధిక కౌలు, పన్నుల విధింపు, వెట్టిచాకిరి చేయించడం, భూములపై నియంత్రణ వంటి సమస్యలు తీవ్రంగా ఉండేవి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పరిస్థితులు ప్రజలు అసంతృప్తిని పెంచాయి.
అకృత్యాలకు వ్యతిరేకంగా..
అలనాటి పాలనలో భూస్వామ్య, జమీందారుల పెత్తనం, అడుగడుగునా నిర్భంధాలు, బలవంత పు వసూళ్లు నిత్యకృత్యంగా సాగేవి. వీటి కి తోడు రజాకార్ల అకృత్యాలు ప్రజలకు శాపాలుగా మారాయి. వీటిని ఎదురించే దిశగా ప్రజలు చైతన్యవంతులై తమ హక్కులను కాపాడుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమించారు. అలా విమోచన ఉద్యమంలో వరంగ ల్ జిల్లా పోరాటాల గడ్డగా నిలిచింది. విమోచన ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించు కున్నది. కాకతీయులు ఏలిన గడ్డపై రజాకార్లను ఎదురించిన వ్యక్తిగా బత్తిని మొగిలయ్య గౌడ్ చరిత్రలో నిలిచిపోయారు.
బైరాన్‌పల్లి గ్రామంపైపడి ఊరును వల్లకాడు చేశారు. వందమందికిపైగా పొట్టన పెట్టుకున్నారు. రజాకార్లు కూటిగల్ మీద కూడా అదే ప్రతాపాన్ని చూపారు. 18 మందిని నిలబెట్టి రాక్షసంగా కాల్చి చంపారు. పరకాలలో ప్రజాసమూహంపై విచక్షణార హితంగా కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు.
రజాకారుల అండతో చెలరేగిన దొరల దౌర్జన్యాన్ని ఎదరించిన చాకలి అయిలమ్మ ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. పోరాటయోధులు తొర్రూరులో పోలీసు క్యాంపుపై దాడిచేసి దాన్ని లేవ నెత్తించారు. కడవెండి, అమ్మాపూర్, నాంచారి మడూ రు తదితర ప్రాంతాల్లో సాగిన తెలంగాణ విమోచన ఉద్యమాలు ప్రజల స్వేచ్ఛా పిపాసకు నిలువెత్తు పతాకలు.
ఉద్యమ క్రమం
ఆంధ్రమహాసభ ద్వారా ప్రజల్లో రాజకీయ, సామా జిక చైతన్యం పెరిగింది. కమ్యూనిస్టు కార్యకర్తలు గ్రామాల్లో రైతులను సంఘటితం చేసి భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, అక్రమ పన్నులు, భూస్వా ముల దౌర్జన్యాలను ఎదురించడం ఉద్యమం ప్రధా నాంశాలుగా మారాయి. 1946 తర్వాత ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చి కొన్ని ప్రాంతాల్లో సా యుధ ప్రతిఘటనగా మారింది. నిజాం ప్రభుత్వం, రజాకార్ల దళాలు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించాయి. గ్రామాలపై దాడులు, అరెస్టులు, హింస చోటుచేసుకున్నాయి. రైతు దళాలు కూడా గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టి భూస్వామ్య దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నాయి.
పోరాట ప్రాంతాలు
ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ఉద్యమ చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు ప్రత్యేకంగా నిలిచింది. ఆమె తన భూమిని ఆక్రమిం చడానికి ప్రయత్నించిన భూస్వామ్య శక్తులకు వ్యతి రేకంగా నిలిచి పోరాడింది.
ఆమె పోరాటం గ్రామీణ మహిళలు, రైతుల్లో ప్రతిఘటన స్పూర్తికి ప్రతీకంగా మారింది. పాలకుర్తి ఆంధ్ర మహాసభ కార్యకలాపా లు, గ్రామ ప్రజల సమావేశాలు జరుగుతున్న సమ యంలో దేశ్‌ముఖ్ అనుచరులతో ఘర్షణలు ఏర్పడ్డా యి. అనంతరం పలువురు గ్రామస్తులపై కేసులు పెట్టారు. ఈ ఘటన పాలకుర్తి కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది. ఈ కేసు ద్వారా గ్రామీణ ప్రజలపై భూస్వామ్య-పోలీసు వ్యవస్థ ఒత్తిడి ఎంతగా ఉండేదో తెలుస్తోంది.
కడవెండి
1946 జూలై 4న కడవెండి గ్రామంలో కీలక సం ఘటన జరిగింది. విస్నూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సమ యంలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించాడు. కొమురయ్య మరణం తర్వాత గ్రామాల్లో సంఘాలు మరింత చురుకయ్యా యి. ఈ సంఘటనతో ఉద్యమం మరింత తీవ్రరూ పం దాల్చి సాయుధ ప్రతిఘటన దిశగా వెళ్లింది.
పరకాల
ఉమ్మడి వరంగల్‌లో పరకాల కూడా నిజాం వ్యతిరేక ఉద్యమానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది. 1947లో పరకాల ప్రాంతంలో జరిగిన కాల్పులు, హింసాత్మక అణచివేతకు సంబంధించిన సంఘటన లు తెలంగాణ విమోచనోద్యమ చరిత్రలో రక్తసిక్తమై న పుటలుగా నిలిచాయి.
బైరాన్‌పల్లి బీభత్సం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి ఉదంతం మరుపురానిది. బైరాన్‌పల్లి గ్రామస్తు లందరూ సమైక్యంగా నిలిచి దైర్యసాహసాలు ప్రద ర్శించి నిజాం సైన్యం బలగాలను, రజాకార్ల రాక్షసకృ త్యాలను ఎదరించి పోరాడారు. ఒక రోజు రజాకార్లు దూలిమిట్ల, లింగాపురం గ్రామాలను దోచుకొని సొమ్మునంతా బండ్లకెత్తుకొని తరలిస్తుండగా బైరాన్ పల్లి రక్షకదళం రజాకార్లను ఎదురించి తరిమికొ ట్టింది. దీంతో బిత్త్లరపోయిన రజాకార్లు ప్రతీకారేచ్ఛ తో రగిలిపోయారు. బైరాన్‌పల్లిపై కక్షతో రజాకార్లు కూటిగల్ గ్రామంలో 20 మందిని కాల్చి చంపారు.
మొగిలయ్య వీరమరణం
రజాకార్ల దాష్టీకానికి పరాకాష్టంగా నిలుస్తోంది బత్తిని మొగిలయ్య హత్యోదంతం. ఉద్యమంలో భా గంగా సర్వోదయ సంఘం పక్షాన ప్రతీవారం వరంగ ల్ కోటలో జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమా న్ని చేపట్టారు.
1946 ఆగస్టు 11న కోటలో జెండా ఎగురవేసిన తర్వాత కాశీం షరీఫ్ నాయత్వంలో రజాకార్లు హఠాత్తుగా దాడిచేశారు. రజాకార్లను ఎదురించే క్రమంలో మొగిలయ్య రజాకార్ల కత్తి పోట్లకు గురై నేలకొరిగాడు.
ముగింపు
1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు యాక్షన్ ఆపరేషన్ పోలోతో నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియ న్‌లో విలీనం అయింది. అయితే రైతాంగ సాయుధ పోరాటం వెంటనే ముగియలేదు. అది 1951 వరకు కొనసాగింది. అనంతరం కమ్యూనిస్టు నాయకత్వం సాయుధ పోరాటాన్ని విరమించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News