దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌కు రూ.500 కోట్ల నోటీసు..
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:22 AM
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా చూపుతూ ఇద్దరూ వ్యాఖ్యలు చేశారని సతీశ్ సాలియన్ నోటీసులో ఆరోపించారు (Disha Salian case).
ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌లు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఏడు రోజుల్లో బహిరంగంగా, ఎలాంటి షరతులు లేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ క్షమాపణను ప్రధాన ముద్రణ, టెలివిజన్, డిజిటల్ మీడియా వేదికల్లో ప్రచురించాలని కూడా నోటీసులో కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సివిల్ పరువు నష్టం కేసుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దిశా సాలియన్ కేసు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కుట్రగా అనిల్ దేశ్‌ముఖ్ అభివర్ణించారు. తన పేరును ఈ కేసుతో పదేపదే ముడిపెట్టడం, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకేనని అదిత్య పేర్కొన్నారు (Aaditya Thackeray Notice).
దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనం నుంచి పడిపోయి మరణించారు (CBI Disha Salian probe). అప్పట్లో ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. ఆమె మరణానికి ఆరు రోజుల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ముంబైలో మృతి చెందారు. 2026 సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు ఆదేశాల అనంతరం దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. సెప్టెంబర్ 14న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి తదితరుల పేర్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..