‘స్మార్ట్’ మాయలో పడితే అంతే...
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:34 AM
చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.
సెల్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్న జనం
అటు మానసిక, ఇటు ఆరోగ్య సమస్యలు
బ్రౌజింగ్‌తో గంటలకు గంటలు వృథా
అతిగా వాడే పిల్లలపై తీవ్ర ప్రభావం
తల్లిదండ్రులు అదుపు చేయాలంటున్న నిపుణులు
వరంగల్: చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే. ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగంతో కొన్ని ఉపయోగాలున్నాయేమో కానీ, బోలెడన్ని నష్టాలు కలుగుతున్నాయి. మనుషుల జీవితాల్లోకి స్మార్ట్‌గా వచ్చి డర్టీగా మారుస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు. వాట్సప్ యాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రాం వల్ల ఎన్ని ఉపయోగాలున్నప్పటికీ కాస్త జాగ్రత్త పాటించకపోతే ఇబ్బందులు తప్పవు.
స్మార్ట్ మాయ..
స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయి నేటి యువత తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. చదువుపై ఆసక్తి తగ్గించి స్మార్ట్ ఫోన్‌లో రకరకాల యాప్‌లను వాడుతూ ఫోన్లకు వ్యసనంగా మారి చదువులో వెనుకబడుతూ తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. గంటల తరబడి ఫోన్ల్‌లో కబుర్లు, వాట్స్‌పలలో చాటింగ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్టింగులు... ఇలా రోజులో ఎక్కువ సమయం యువత ఫోన్లతో కాలక్షేమం చేస్తోంది. ఇటీవలి కాలంలో ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారని వారించినందకు కన్న తల్లిదండ్రులపై దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి.
తలెత్తే సమస్యలు..
స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో సృజనాత్మక శక్తి క్రమంగా క్షీణించడం, ఆలోచనా శక్తి మందగించడం, నేత్రాలు పొడిబారడం, చిన్న వయస్సులోనే దృష్టి లోపం, వీడియోలు చూస్తూ పరిమితికి మించి తినడం వల్ల ఊబకాయం, ఆటపాటలు, మానవ సంబంధాలకు దూరమవడం, చిన్నవయస్సులోనే మానసిక రుగ్మతల బారిన పడటం, ఒత్తడి, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం, హృద్రోగ సమస్యలకు గురవడం, డిజిటల్ ఆడిక్షన్‌కు గురై చదువులో వెనకబడటం ఇలా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
అతిగా ఫోన్ వాడితే..
సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్ల టవర్లు సమాచారానికి సంబంధించిన సంకేతాలను ఒకచోటి నుంచి మరో చోటికి పంపే క్రమంలో శక్తివంతమైన సూక్ష్మతరంగాలను(మైక్రోవేవ్స్) ఉపయోగిస్తాయి. ఎక్స్‌రే లాగా ఈ తరంగాలు సైతం మన శరీరంలోకి చొచ్చుకుపోతాయి. ఇలా శరీరంలో నుంచి ప్రయాణించబడే ఈ సూక్మ తరంగాలు మన శరీర కణాల్లో కొన్ని అవాంఛనీయమైన మార్పులను తీసుకువస్తాయని, అవి దీర్ఘకాలంలో మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. సెల్‌ఫోన్ల తరంగాలు పెద్దవారి మెదడుపై కంటే చిన్నపిల్లల మెదడుపై 3 రేట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయంటున్నారు.
సెల్‌ఫోన్(Cellphone)లో మాట్లాడేటప్పుడు ఎడమ చెవి ఎక్కువగా ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్లలో గంటల తరబడి మాట్లాడటం మన ఆరోగ్యానికి మంచిది కాదని, సాధ్యమైనంతవరకు సెల్‌ఫోన్లలో కట్టె-కొట్టె-తెచ్చె అన్న విధంగా మాట్లాడి సంభాషణలను ముగించడం ఉత్తమమని అంటున్నారు. అస్తమానం అదేపనిగా స్మార్ట్ ఫోన్ల వాడకంతో మెడనొప్పి, కళ్లు దెబ్బతిని చూపు మందగించడం, తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, అలసట రావడం, ఆలోచన శక్తి తగ్గిపోవడం, చురుకుదనం తగ్గటం, మానసిక ఉల్లాసం లేకపోవడం, ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు
5 సంవత్సరాల లోపు పిల్లలను స్మార్ట్ ఫోన్ల కు దూరంగా ఉంచడంమంచిది. వారు మారం చేస్తుంటే పిల్లలను బుజ్జగించే క్రమంలో ఫోన్ చూపించడం ఏమాత్రం మంచిది కాదు. ఆ సమయంలో మనకు తెలియకుండానే మన పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను మనమే పరిచయం చేస్తున్నాం. ఇలా క్రమేనా ఫోన్‌కి అలవాటు పడిన పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే వారు విపరీతమైన ఆక్రోశానికి గురై, మానసికంగా విచలితం చెంది వింతగా ప్రవర్తించడం, ఎదురు తిరగడం, ఇంట్లోని విలువైన వస్తువులను పగులకొట్టడం ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News