Share News

పింఛను పెంపు!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:36 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా..

పింఛను పెంపు!

  • దశల వారీగా చేయూత పింఛను పెంచనున్న ప్రభుత్వం

  • తొలి విడతలో రూ.500 పెంచాలన్న యోచన

  • బడ్జెట్‌లో కేటాయింపులు చేసే అవకాశం

  • ప్రస్తుత పింఛన్‌ రూ.2,016.. దివ్యాంగులకు 4,016

  • ఏడాదికి అవుతున్న మొత్తం వ్యయం రూ.11,400 కోట్లు

  • రూ.500 పెంచితే అదనంగా.. ఏటా సుమారు రూ.2500 కోట్లు అవసరం

  • విడతల వారీగా ‘చేయూత’ రూ.4 వేలకు పెంపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. పింఛను మొత్తాన్ని విడతల వారీగా పెంచాలన్న అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ రోగులు, డయాలసిస్‌ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.4016 చొప్పున పింఛను ఇస్తోంది. కానీ, ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం వంటి హామీలను అమలులోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. అయితే ఈ హామీని కొంతకాలం ఆగాక నెరవేర్చడమా? లేదంటే ఇప్పటి నుంచే విడతల వారీగా పింఛను పెంచుతూ వెళ్లడమా? అని ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. విడతలవారీగా పెంచితే.. తొలి విడతలో రూ.500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

42.7 లక్షల మందికి పింఛను..

2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛను అందుతోంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.950 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ పింఛన్‌ను ప్రస్తుతానికి రూ.500 చొప్పున పెంచితే.. నెలకు సుమారు రూ.210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి రూ.2500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనుంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్‌లో కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్‌లో కేటాయింపులు చేయన్నుట్లు తెలుస్తోంది. కాగా, దివ్యాంగుల పింఛను పొందేవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారని, వీటి వరకు కొంత ఎక్కువ మొత్తం పెంచాలన్న విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. అయితే అందరికీ ఒకే విధంగా, సమ స్థాయిలోనే పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చేయూత ఫించన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి రూ.4 వేలకు తీసుకెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారుల స్థాయిలో మాత్రం చర్చలు మొదలుకాలేదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాకే తమకు సమాచారం చేరుతుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 05:48 AM