Share News

రాజకీయాల్లోకి మావోయిస్టులు?

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:44 AM

జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్‌ నేతలు ఏం చేయబోతున్నారు....

రాజకీయాల్లోకి మావోయిస్టులు?

  • ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు!.. రాజకీయాల్లోకి వస్తానన్న దేవ్‌జీ

  • జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో?.. దామోదర్‌ కూడా అదే బాటలో..?

  • అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్‌ఎస్లో కీలక నేత

  • రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు.. పార్టీ, అజెండాలపై చర్చ

వరంగల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్‌ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు, హింసను వీడి.. ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోనున్నారా? రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ.. తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ కూడా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే దామోదర్‌ సోదరుడి కుమార్తె బడే నాగజ్యోతి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దేవ్‌జీ బాటలో నడిచేందుకు చాలామంది లొంగిపోయిన మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు రాజకీయల్లోకి ప్రవేశిస్తే కొత్త పార్టీ పెడతారా? లేదా ఏ పార్టీలో చేరతారు? అజెండా ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.


మాజీల కొత్త బాట

మావోయిస్టు విముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టింది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం, అబూజ్‌మడ్‌లోకి కేంద్ర బలగాలు చొచ్చుకుపోయాయి. అనేక మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందుతుండగా, ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు నేతలే ఇన్నాళ్లూ మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల ఎన్‌కౌంటర్‌తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణ, గాజర్ల గణేశ్‌, గుమ్మడివెల్లి రేణుక, అంకేశ్వరపు సారయ్య అలియాస్‌ సుధీర్‌ తదితర కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో హతమవడంతో మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు తమ పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌తో సమస్యలపై పోరాడాలన్న ఆలోచనతోనే చాలామంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. తొలుత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ సోను పెద్దఎత్తున సహచర మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కీలక నేతలు లొంగిపోయారు. వారిలో చాలామంది ప్రజాజీవితంపై ఆసక్తిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు దేవ్‌జీ, బడే చొక్కారావు, రాజిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. దేవ్‌జీ తన లొంగుబాటుతో పాటు భవిష్యత్తు బాటను ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని, చట్టబద్ధంగా పోరాటం చేస్తానని చెప్పారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దేవ్‌జీ జనరల్‌ స్థానాలపై దృష్టి పెట్టి బ్యాలెట్‌తో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటానికి సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో నిలిచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. దామోదర్‌ సోదరుడు బడే నాగేశ్వర్‌రావు కుమార్తె నాగజ్యోతి ములుగు జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ప్రస్తుత మంత్రి సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో దామోదర్‌ సైతం రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఆదివాసీల్లో గట్టి పట్టున్న దామోదర్‌ రాజకీయ ప్రవేశం ఆసక్తికరంగా మారనుంది. వీరితో పాటు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌రావు తాను రాజకీయాల్లోకి రానని చెప్పలేదని వ్యాఖ్యానించారు. తక్కళ్లపల్లి వాసుదేవరావుతో పాటు మరికొంత మంది మాజీలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై పోరాడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఏ జెండా.. ఏ పార్టీ..?

మాజీ మావోయిస్టు నేతలు దశాబ్దాల తరబడి ఎర్రజెండా నీడన అడవుల్లో ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. లొంగిపోయిన తర్వాత కాలానుగుణంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే దానికి నాయకత్వం వహించేది ఎవరు? నిధులతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సిన అజెండా ఏంటనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పార్టీలను కాదని ప్రజలు తమని ఆదరించాలంటే ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఎర్ర జెండా పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీని నడపడం అంత సులభం కాదని, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ప్రజలకు సేవ చేయగలిగే పార్టీలో చేరడం ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. కొత్త పార్టీనా..? లేదంటే ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 26 , 2026 | 02:44 AM