Share News

లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్‌లో ఘటన

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:55 AM

అక్రమంగా న్యాయవిద్య డిగ్రీ పట్టా సంపాదించి న్యాయమూర్తిగా మారిన జస్టిస్ తారిఖ్ మొహమ్మద్ జహంగిర్ నియామకం చెల్లదంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్‌లో ఘటన
Pak Justice Tariq Mohammad Jahangir

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లో తాజాగా వింత ఘటన చోటుచేసుకుంది. ఓ న్యాయమూర్తి లా డిగ్రీ చెల్లని కారణంగా జడ్జిగా ఆయన నియామకం రద్దైందంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సర్దార్ మొహమ్మద్ సర్ఫరాజ్ డొగర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, అక్రమ మార్గాల్లో న్యాయ డిగ్రీ తెచ్చుకున్న జస్టిస్ తారిఖ్ మొహమ్మద్ జహంగిర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తారిఖ్‌ను దోషిగా తేల్చింది. ఆయన డిగ్రీ సర్టిఫికేట్లల్లో అవకతవకలు ఉన్నాయని పేర్కొంది. 1988లో కరాచీ యూనివర్సిటీ పరీక్షలకు ఆయన నకలీ రోల్ నెంబర్‌తో హాజరయ్యారని కోర్టు తెలిపింది. అధికారులకు దొరికి మూడేళ్ల పాటు డీబార్ అయ్యారనీ వెల్లడించింది. కానీ శిక్షా కాలం పూర్తయ్యే వరకూ వేచి చూడకుండా మళ్లీ మరొకరి రోల్ నెంబర్‌తో పరీక్షకు హాజరయ్యారని తెలిపింది. ఒక విద్యార్థికి ఒకే రోల్ నంబర్ ఇస్తామన్న కరాచీ యూనివర్సిటీ స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జస్టిస్ తారిఖ్ లా డిగ్రీ పట్టా, జడ్జిగా ఆయన నియామకం చెల్లదంటూ తీర్పు వెలువరించింది.


అయితే, జస్టిస్ తారిఖ్ మాత్రం ఈ తీర్పును పాక్ ఫెడరల్ రాజ్యాంగ కోర్టులో సవాలు చేశారు. తన కేసు విచారణ న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా సాగలేదని ఆరోపించారు. తొలి నుంచీ తాను పక్షపాత ధోరణిని ఎదుర్కొన్నానని చెప్పారు.

జస్టిస్ తారిఖ్ గతంలోనూ పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా తీర్పులు వెలువరించారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయొద్దని ఓ సందర్భంలో పోలీసులను ఆదేశించి కాంట్రవర్సీకి తెరతీశారు. నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రభావం న్యాయవ్యవస్థలో ఎక్కువైందని ఆరోపిస్తూ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌కు గతంలో ఒకసారి లేఖ రాశారు.


ఈ వార్తలనూ చదవండి:

సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్

ఇరాన్‌పై పరిమిత దాడి: ట్రంప్‌

Updated Date - Feb 26 , 2026 | 10:44 AM