సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:42 PM
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్‌నకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. సుంకాల పేరిట తాము చెల్లించిన అధిక చార్జీలను రీఫండ్ చేయాలంటూ సామాన్య అమెరికన్ల నుంచి కార్పొరేట కంపెనీలకు వరకూ ట్రంప్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సుంకాల విధింపు చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. సుంకాల వల్ల ఇప్పటివరకూ అధిక ధరలు చెల్లించిన అమెరికన్ కస్టమర్లు తమకు రీఫండ్స్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ జాబితాలో ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ప్రక్రియ అంత సులభం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు.
రీఫండ్స్ కోసం పోటెత్తుతున్న డిమాండ్స్
తాను విధించిన సుంకాల భారం విదేశీ ఎగుమతిదారులపై తప్ప సామాన్య అమెరికన్లు, అమెరికా దిగుమతిదారులపై లేదని ట్రంప్ ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అయితే, ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈ వాదనతో మొదటి నుంచీ విభేదిస్తున్నారు. అధిక సుంకాల భారాన్ని సామాన్య అమెరికన్లే భరించాల్సి వచ్చిందని మండిపడేవారు. ఇక సుప్రీం తీర్పు తరువాత ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్ సుంకాల రీఫండ్స్ కోరుతూ ట్రంప్‌నకు బిల్లులు పంపించారు. సుంకాల కారణంగా తమ రాష్ట్రం 9 బిలియన్ డాలర్లు అధికంగా చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. తమ రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై సగటున 1,700 డాలర్ల అదనపు భారం పడిందని అన్నారు. ఇక కార్పొరేట్ కంపెనీలు కూడా రీఫండ్స్‌కు సిద్ధమవుతున్నాయి. కాస్ట్‌కో, రెవ్లాన్ వంటి పలు సంస్థలు ఇప్పటికే కేసులు దాఖలు చేశాయి. ఇప్పటివరకూ ట్రంప్ ప్రభుత్వం సుంకాల పేరిట 133 బిలియన్‌ల నుంచి 175 బిలియన్ డాలర్ల మేర వసూలు చేసి ఉంటుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.
సామాన్య వినియోగదారులకు రీఫండ్ దక్కుతుందా?
సుంకాల డబ్బులో ఎంతో కొంత తిరిగిస్తామని ట్రంప్ వర్గం ఇప్పటికే పలుమార్లు తెలిపింది. అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. సామాన్య ప్రజలకు నేరుగా రీఫండ్స్ అందే అవకాశాలు తక్కువని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ కూడా పేర్కొన్నారు. రీఫండ్స్‌లో అధికభాగం దిగుమతిదారులు, అమెరికన్ కంపెనీలకే వెళుతుందని చెబుతున్నారు. విదేశీ ఉత్పత్తుల దిగుమతి సమయంలో వీరే కస్టమ్స్ శాఖకు నేరుగా సుంకాల రూపంలో అధిక ధరలను చెల్లించారని వివరిస్తున్నారు.
సంక్లిష్టంగా మారనున్న రీఫండ్ ప్రక్రియ
రీఫండ్స్ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉంటుందని ఇప్పటికే జస్టిస్ ఏమీ కోనీ బేరెట్, జస్టిస్ బ్రెట్ కేవనా హెచ్చరించారు. ఈ విషయంలో కోర్టు కేసులు కొలిక్కి వచ్చేసరికి రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని ట్రంప్ కూడా ఇటీవల ఓ సందర్భంలో స్వయంగా అంగీకరించారు. వేల కొద్ది దిగుమతిదారుల రిఫండ్స్ అభ్యర్థనలను పరిశీలించడం కస్టమ్స్ శాఖకూ భారంగా మారుతుందని అంటున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ట్రంప్ సర్కారు పలు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.
న్యూయార్క్ ఫెడ్, జేపీ మోర్గన్, కీల్ ఇన్‌స్టిట్యూ్ట్ అంచనా ప్రకారం, కస్టమ్స్ శాఖ వసూలు చేసిన సుంకాల్లో 90 నుంచి 96 శాతం అమెరికన్ల జేబుల్లోంచే వెళ్లాయి. భారత్, చైనా, మెక్సికో లాంటి దేశాలు తమ ఉత్పత్తుల ధరల తగ్గింపు రూపంలో 4-10 శాతం మాత్రమే సుంకాల భారాన్ని భరించాయి.
ఈ వార్తలూ చదవండి: