Share News

ట్రంప్‌ సుంకాలు చెల్లవ్‌!

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:23 AM

సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ముకుతాడు వేసింది. ‘విమోచన దినం’ పేరుతో గత ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన.....

ట్రంప్‌ సుంకాలు చెల్లవ్‌!

  • అలా విధించడం రాజ్యాంగ విరుద్ధం: అమెరికా సుప్రీం కోర్టు

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి కనీవినీ ఎరుగని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికారం లేకున్నా.. అత్యవసర చట్టం కింద అడ్డగోలు సుంకాలు విధిస్తామంటే కుదరదని.. అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సుంకాలు విధించే అధికారం కాంగ్రె్‌సకే ఉంది తప్ప.. రాజ్యాంగ నిర్మాతలు ఆ హక్కును కార్యనిర్వాహక శాఖకు అప్పగించలేదని స్పష్టం చేసింది. ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెబితే.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమెరికా ప్రయోజనాలకే విరుద్ధంగా ఉందంటూ ట్రంప్‌ మండిపడ్డారు! విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారంటూ జడ్జీలపైనే ఆరోపణలు చేశారు. వారు అమెరికాకే అవమానకరమని దుయ్యబట్టారు. సుంకాలపై తగ్గేదేలేదని.. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేస్తామని తేల్చిచెప్పారు. వేరే చట్టాల కింద.. అన్ని దేశాలపైనా 10ు ప్రత్యామ్నాయ సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

  • అత్యవసర చట్టం కింద సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదు

  • ఆ చట్టం కింద వాణిజ్యాన్ని నియంత్రించే హక్కు మాత్రమే ఉంటుంది

  • ఇంతకుముందు ఏ అధ్యక్షుడూ ఇలా సుంకాలు విధించలేదు

  • టారిఫ్‌లను కొట్టేస్తూ అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  • 6-3 మెజారిటీతో దిగువ కోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం

  • అమెరికా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా సుంకాల రూపంలో వసూలు చేసింది దాదాపు రూ.16 లక్షల కోట్లు

  • తిరిగి చెల్లించాలంటూ కోర్టులను ఆశ్రయించిన దిగుమతిదారులు

  • దాని గురించి తీర్పులో ప్రస్తావించని మెజారిటీ న్యాయమూర్తులు

  • తీర్పులో భారత్‌పై సుంకాల ప్రస్తావన.. ట్రంప్‌ నియమించిన ముగ్గురు జడ్జిల్లో ఒక్కరే సుంకాలకు అనుకూలం

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 20: సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ముకుతాడు వేసింది. ‘విమోచన దినం’ పేరుతో గత ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన.. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద పలు దేశాలపై ఆయన విధించిన భారీ టారి్‌ఫలను కొట్టేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.

2.jpg


ఆ చట్టం కింద ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప సుంకాలు విధించే హక్కు ఉండదని తేల్చిచెప్పింది. తన అధికార పరిధిపై ట్రంప్‌ చేసిన అత్యంత వివాదాస్పద వాదనలను తోసిపుచ్చింది. సుంకాల మోత మోగించడానికి 1977నాటి ఐఈఈపీఏ చట్టాన్ని ట్రంప్‌ ఉపయోగించిన తీరు ఆయన అధికార పరిధిని మించి ఉందంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో సమర్థించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రె్‌సకే ఉంటుందని.. టారి్‌ఫలు కూడా పన్నుల్లో భాగమేనని మెజారిటీ జడ్జిలు స్పష్టం చేశారు. ‘‘పన్నులు విధించే అధికారంలో ఏ భాగాన్నీ కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగం అప్పగించలేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ తన తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఇతర అధ్యక్షులు ఈ చట్టాన్ని పలుమార్లు వినియోగించారుగానీ.. వారు ఆంక్షలు విధించడానికి మాత్రమే వాడారు. దిగుమతి పన్నులు వేయడానికి ఈ చట్టాన్ని వాడిన మొట్టమొదటి అధ్యక్షుడు ట్రంపే. ఈ నేపథ్యంలో.. ‘‘ఏఈఈపీఏలో అలాంటి అధికారం ఉందని ఇప్పటివరకూ ఏ అధ్యక్షుడూ గుర్తించకపోవడమే.. అసలు ఆ అధికారం అక్కడ లేదనడానికి బలమైన సాక్ష్యం’’ అని చీఫ్‌ జస్టిస్‌ రాబర్ట్స్‌ తన తీర్పులో పేర్కొన్నారు. అయితే.. మెజారిటీ తీర్పుతో న్యాయమూర్తులు శామ్యూల్‌ అలిటో, క్లారెన్స్‌ థామస్‌, బ్రెట్‌ క్యావనో విభేదించారు. అధ్యక్షుడి చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాదని, కొన్ని సందర్భాల్లో కార్యనిర్వాహక శాఖకు కూడా టారి్‌ఫలు విధించే అధికారం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా.. టారి్‌ఫల రూపంలో ఇప్పటికే వందల కోట్ల డాలర్లు చెల్లించిన కంపెనీలు తిరిగి ఆ సొమ్మును పొందవచ్చా లేదా అనే విషయంపై కోర్టు ఎలాంటి ప్రస్తావనా చేయలేదు.


టారిఫ్‌ల రూపంలో తాము కట్టిన సొమ్మును తిరిగి చెల్లించాలంటూ అతి పెద్ద వేర్‌హౌస్‌ చైన్‌ కాస్ట్‌కో సహా పలు కంపెనీలు ఇప్పటికే దిగువ కోర్టులకు క్యూ కట్టిన నేపథ్యంలో.. ఆ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండొచ్చని న్యాయమూర్తి బ్రెట్‌ క్యావనో అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఆయన తన తీర్పులో భారత్‌పై విధించిన 25ు అదనపు సుంకాల గురించి కూడా ప్రస్తావించారు. ‘‘చైనా, యూకే, జపాన్‌, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అధ్యక్షుడు ఈ సుంకాలను ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణను ముగించడానికి 2025 ఆగస్టు 6న ఆయన.. ప్రత్యక్షంగా/పరోక్షంగా రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌పై అదనంగా (25ు) సుంకాలను విధించారు. రష్యా చమురు కొనబోమని భారత్‌ హామీ ఇవ్వడంతో ఆ సుంకాలను తొలగించారు’’ అని క్యావనో గుర్తుచేశారు. ఇక.. ఈ తీర్పుతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో పెరుగుదల కనిపించింది. ఎస్‌అండ్‌పీ 500, డౌ జోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ 0.4 శాతం మేర పెరగ్గా.. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 0.6ు మేర పెరిగింది.

వసూలు చేసింది ఎంత?

జాతీయ అత్యవసర చట్టం కింద ట్రంప్‌ విధించిన టారి్‌ఫలతో అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు 14 దాకా 3,01,000 మందికిపైగా దిగుమతిదారుల నుంచి 133 బిలియన్‌ డాలర్లు (రూ.12 లక్షల కోట్లు) వసూలు చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా వసూలైన మొత్తం కూడా కలిపితే అది 175 బిలియన్‌ డాలర్ల (రూ.16 లక్షలకోట్ల)కు పైగానే ఉంటుందని అంచనా. ‘‘ఆ సుంకాలన్నింటినీ తిరిగి చెల్లించాలంటే.. అసలు ఏ వస్తువుపై ఎంత పన్ను పడింది? ఆ పన్ను భారాన్ని ఇప్పటికే కంపెనీలు వినియోగదారులపై వేశాయా? ఒకవేళ అలా వేసి ఉంటే.. ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సింది కస్టమర్లకా? కంపెనీలకా? ఇలాంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఇవ్వకుంటే కంపెనీలు పెద్ద ఎత్తున కోర్టులను ఆశ్రయిస్తాయి. అందుకే.. ‘తిరిగి చెల్లింపుల ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశం ఉంది’’ అని న్యాయమూర్తి బ్రెట్‌క్యావనో హెచ్చరించారు. కాగా, ట్రంప్‌ టారి్‌ఫలు చట్టవిరుద్ధమంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. కట్టు తప్పిన వ్యవస్థను దారిలోకి తెచ్చేలా అమెరికా న్యాయవ్యవస్థ ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ట్రంఫ్‌ టారిఫ్‌ విధానాలను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం గొప్ప నిర్ణయమంటూ జైరాం రమేశ్‌ పొగడ్తలు కురిపించారు.


ఇలా విధించారు!

  • నిరుడు ఏప్రిల్‌ 2న సుంకాల మోత మోగించిన ట్రంప్‌

అమెరికాతో వాణిజ్యసంబంధాలున్న అన్ని దేశాలపైనా జాతీయ అత్యవసర చట్టం(ఐఈఈపీఏ) కింద 10ు కనిష్ఠ (బేస్‌లైన్‌) సుంకం ఉంటుందని, తమపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై దానికి అదనంగా ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు గతేడాది ఏప్రిల్‌ 2న ట్రంప్‌ ప్రకటించారు. అందులో భాగంగా తమపై 52ు సుంకాలు విధిస్తున్న భారతదేశంపై తాము అందులో సగం, అంటే 26ు సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. చైనాపై 54ు, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలపై 20ు, వియత్నాంపై 46ు, థాయ్‌ల్యాండ్‌పై 36ు, కంబోడియాపై 49ు, తైవాన్‌పై 32ు, జపాన్‌పై 24ు, బంగ్లాదేశ్‌పై 37ు, పాకిస్థాన్‌పై 29ు, శ్రీలంకపై 44ు.. ఇలా దేశాలవారీగా సుంకాల మోత మోగించారు. ట్రంప్‌ ప్రారంభించిన ఈ వాణిజ్య యుద్ధం.. అమెరికా వాణిజ్య భాగస్వాములతో సంబంధాలను దెబ్బతీయడమే కాక, ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితికి కారణమైంది.

తీర్పును అధ్యయనం చేస్తున్నాం

  • ప్రపంచ దేశాల స్పందన

ట్రంప్‌ టారి్‌ఫలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రపంచ దేశాలు స్పందించాయి. ట్రంప్‌ టారిఫ్‌ విధానాలు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినట్లైందని కెనడా అభిప్రాయపడింది. తీర్పు ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని యూరోపియన్‌ యూనియన్‌ తెలిపింది. పరిస్థితులు ఎలా ఉన్నా అమెరికాతో తమ ప్రత్యేక వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని బ్రిటన్‌ తెలిపింది. అమెరికాతో కలిసి పనిచేస్తామంది.


1.jpg

ముగ్గురు జడ్జిల్లో ఒక్కరే సుంకాలకు అనుకూలం

  • తీర్పునిచ్చిన జడ్జీల్లో ముగ్గురు ట్రంప్‌ నియమించినవారే

దిగుమతులపై భారీ సుంకాలను విధించడానికి ట్రంప్‌ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడాన్ని సవాల్‌ చేస్తూ.. ఈ టారి్‌ఫల వల్ల నష్టపోయిన వ్యాపారసంస్థలు, డెమొక్రాట్ల పాలనలో ఉన్న 12 అమెరికా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్‌ తన అధికార పరిధిని మించి ఈ చట్టాన్ని వాడారని, పన్నులు వేసే అధికారం అధ్యక్షుడికి లేదని దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ సర్కారు ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. సుప్రీం కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో.. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమించిన ముగ్గురు కన్జర్వేటివ్‌ జడ్జీలు ఉన్నారు. దీంతో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని చాలా మంది భావించారు. ట్రంప్‌ కూడా.. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన కేసుల్లో ఒకటని.. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ అవుతుందని హెచ్చరించారు. కానీ, ఆ ముగ్గురు జడ్జీల్లో బ్రెట్‌ క్యావనావ్‌ మాత్రమే అనుకూలంగా తీర్పునివ్వగా.. మిగతా ఇద్దరూ (నీల్‌ గోర్సచ్‌, అమీ కోనీ బారెట్‌) ప్రతికూల తీర్పునిచ్చిన మెజారిటీ జడ్జీల్లో ఉన్నారు. జడ్జీలే కాదు.. రిపబ్లికన్‌ పార్టీకి ఎప్పుడూ మద్దతుగా ఉండే వ్యాపార అనుకూల బృందాలన్నీ ఈ విషయంలో ట్రంప్‌ను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. టారి్‌ఫల వల్ల ధరలు కూడా పెరుగుతుండడంతో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది.

Updated Date - Feb 21 , 2026 | 02:36 AM