Share News

నేడు ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:44 AM

పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా పండుగ.

నేడు ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..
Sheetla Festival 2026

  • లంబాడీల తొలి పండుగ ఇదే

  • ప్రతియేట పెద్దపుషాల కార్తెలో జరుపుకోవడం ఆనవాయితీ

మహబూబాబాద్‌: పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే పెద్ద పుషాల కార్తె మంగళవారం గిరిజనులు సీత్లాపండుగను జరుపుకోవడం ఆనవాయితీ. బంజారాలు జరుపుకునే పండుగల్లో ఇదే తొలి పండుగ. ఈ ఏడాది పెద్ద పుషాల మొదటి మంగళవారం జూలై 7న సీత్లా పండుగను జరుపుకోవడానికి గిరిజనులు సన్నద్ధమయ్యారు.


పూర్వ కాలం నుంచే..

సీత్లా పండుగ ఆచారం పూర్వం నుంచి కొనసాగుతుంది. బంజారాలు వందల సంఖ్యలో పశు సంపదను కలిగి ఉండేవారు. వాతావరణంలో స్వల్ప మార్పులు వచ్చినప్పుడల్లా పశువులు రోగాల బారిన పడేవి. వర్షాకాలం మొదలు కాగానే తండాల్లోని పశువులు వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండేవి. పశువులకు జ్వరం, కాలు డెక్కలు చెడిపోవడం, నోరు చెడి మేత మేయకపోవడం మొదలగు లక్షణాలతో పశువులు మృత్యువాత పడుతుండేవి. మనుషులకు వాంతులు, విరేచనాలు (గత్తర) కలర వ్యాధితో వైద్యం అందుబాటులో లేక అనేక మంది మృతి చెందారు. దీంతో భయాందోళనకు గురైన గిరిజనులు సీత్లామాతను పూజిస్తూ గొర్రెపోతును బలి ఇచ్చి రోడ్డుకు ఇరువైపుల పేగులు అల్లి వాటిపై నుంచి పశువులను దాటిస్తారు. నవ ధాన్యంలో గొర్రెపోతు రక్తం కలిపి పశువులపై చల్లుతారు. ఈ సీత్లాపండుగ ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తోంది.


hnk1.3.jpgసీత్లాభవానికి పూజలు ఇలా..

పశుసంపద రక్షణ కోసం గోర్‌ బంజారాలు ఏడుగురు దేవతలైన మేరామా, తోళ్జ్యా, మాత్రాల్‌, కంకాళి, హింగ్లా, ద్వాళంగర్‌, సీత్లా మాతాలను పూజిస్తారు. వీరితో పాటు వారికి రక్షణగా ఉండే లుంకిడ్యాను సైతం కొలుస్తారు. వర్షాకాల ఆరంభంలో పునర్వసు పెద్దపుషాల కార్తెలో ఏదైన ఒక మంగళవారం వీలు చూసుకుని సీత్లామాతను కొలుస్తారు. అన్ని పండుగల వలే ఇళ్లల్లో కాకుండా తండాకు దగ్గరగా ఉండే చెరువు ఒడ్డున లేదా రోడ్డుపై ఈ పూజ చేస్తారు. పొడవాటి రాళ్లతో తయారు చేసిన ఏడు ప్రతిమలను ఒకే వరుసలో ప్రతిష్ఠించి వాటికి ఎదురుగా వంద అడుగుల దూరంలో లుంకిడ్యా ప్రతిమను ఏర్పాటు చేస్తారు. తండాల్లోని మహిళలు, ఆడపడుచులు (లాప్సి) నైవేద్యం, నవధాన్యాలు, పరిశుభ్రమైన నీటిని తీసుకుని పాటలు పాడుతూ... నృత్యం చేసుకుంటూ దేవతలను ప్రతిష్ఠించిన ప్రదేశానికి చేరుకుంటారు. సీత్లామాతకు లంబాడీల ఆచార సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. సల్లంగ సూడు తల్లి అంటూ వేడుకుంటారు.


hnk1.2.jpgఒకే రోజు సీత్లా పండుగ జరుపుకునేందుకు..

దేశంలోని గోర్‌బంజారులంతా ఒకే తేదీనా సీత్లా పండుగ జరుపుకునేందుకు మహబూబాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు బానోత్‌ నెహ్రూరాథోడ్‌ 12 సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం జూలై 7న పండుగను జరుపుకోనున్నారు. గోర్‌ సిక్వాడీ వేదిక.. గిరిజన సమాజంలో చైతన్యం కోసం పని చేస్తున్నాయి. గిరిజన తండాల్లోనే కాకుండా ఉద్యోగ, వ్యాపార రీత్యా నగరాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న గిరిజనులు కూడా సీత్లా భవాని పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.


ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి

  • బానోత్‌ నెహ్రూ రాథోడ్‌, ప్రముఖ వైద్యుడు, మహబూబాబాద్‌

లంబాడా గిరిజనులు నిర్వహించుకునే సీత్లా పండుగకు ప్రభుత్వం గుర్తింపు నివ్వాలి. బంజారాలు జరుపు కునే పండుగల్లో ఇదే తొలి పండుగ. గిరిజన మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీత్లాపండుగను ప్రభుత్వం గుర్తించి వార్షిక క్యాలెండర్‌లో వివి ధ పండుగలతో పాటు బంజారాల సీత్లా పండుగను కూడా ముద్రించేలా కృషి చేయాలి. పెద్దపుషాల కార్తెలో మొదటి మంగళవారం జరుపుకునే గిరిజనుల పెద్ద పండుగ సీత్లా పండుగ.


సెలవు దినంగా ప్రకటించాలి

  • గుగులోత్‌ కిషన్‌ నాయక్‌, గిరిజన చైతన్య వేదిక

    వ్యవస్థాపక అధ్యక్షుడు, మహబూబాబాద్‌

లంబాడ గిరిజనులు నిర్వహించుకునే పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు జూలై 7న జరుపుకోవాలి. అలా కాకుండా రాష్ట్ర వ్యా ప్తంగా ఒకేరోజు జరుపుకునే విధంగా ప్రభు త్వం సెలవు దినంగా ప్రకటించాలి. అందుకు గిరిజనులు ఐక్యతతో ప్రభుత్వంతో మాట్లాడి లంబాడ గిరిజనులం తా ఒకే రోజు పండుగ జరుపుకుని ఐక్యత చాటాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 11:44 AM