Share News

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:03 AM

పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా అందించాల్సింది పోయి.. కొందరు పశుపోషకులు మూగజీవాల ప్రాణాలను పణంగా పెడుతూ పాచిపోయిన బిర్యానీ, ఆహార పదార్థాలను పెడుతున్నారు.

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!
Biryani, Milk, Sangareddy

  • మూగజీవాల ప్రాణాలతో చెలగాటం

  • హోటళ్ల నుంచి చౌకగా కొనుగోలు

  • దాణాకు బదులుగా ఫీడింగ్‌

  • పశువులకు ప్రాణసంకటం..

  • వినియోగదారులకూ ప్రమాదకరం

గుమ్మడిదల(సంగారెడ్డి): పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా అందించాల్సింది పోయి.. కొందరు పశుపోషకులు మూగజీవాల ప్రాణాలను పణంగా పెడుతూ పాచిపోయిన బిర్యానీ, ఆహార పదార్థాలను పెడుతున్నారు. పట్టణాల్లోని హోటళ్లు, డాబాల నుంచి సేకరించిన పాచిపోయిన పదార్థాలను డ్రమ్ముల్లో తరలించి దాణాగా వేస్తున్నారు. గుమ్మడిదల మండలంలో ఈ ధోరణి ఆందోళన కలిగిస్తున్నది. గుమ్మడిదల మండల కేంద్రంతో పాటు దోమడుగు, అన్నారం, బొంతపల్లి, మంబాపూర్‌ తదితర గ్రామాల్లో ఈ పాచి బిర్యానీ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌, మెదక్‌ ప్రాంతాల్లోని హోటళ్లలో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను డీసీఎంలు, మినీ వాహనాల్లో పెద్ద పెద్ద ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నింపి తీసుకొచ్చి పశుపోషకులకు విక్రయిస్తున్నారు. చౌకగా లభిస్తుందనే కారణంతో కొందరు పశుపోషకులు రాత్రి వేళల్లో ఈ వ్యర్థాలను తమ పశువులకు దాణాగా పెడుతున్నారు.


పశువైద్య నిపుణుల హెచ్చరిక

పాచిపోయిన మాంసాహార పదార్థాలు తీసుకోవడం వల్ల పశువులకు జీర్ణ సంబంధిత వ్యాధులు, ఫుడ్‌ పాయిజనింగ్‌, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఇలాంటి ఆహారం తీసుకున్న పశువుల నుంచి సేకరించే పాలలో దుర్వాసన వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. అధిక పాల దిగుబడి వస్తాయనే ఆశతో కొందరు పశుపోషకులు ఈ అశాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుండటంతో పాల నాణ్యత దెబ్బతింటోందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పలువురు వినియోగదారులు తాము కొనుగోలు చేసే పాలు దుర్వాసన వస్తున్నాయని వాపోతున్నారు. పాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


పట్టించుకోని అధికారులు

ప్రధాన రహదారుల పక్కనే పశువులకు పాచి బిర్యాని వేస్తున్న దృశ్యాలు అందరికీ కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణ హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను పశువులకు దాణాగా వినియోగించడాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పశువైద్యశాఖ అధికారులు పశువులకు కలిగే నష్టాలను రైతులకు వివరించాలి. హోటళ్ల వ్యర్థాల రవాణాపై పర్యవేక్షణ పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

కౌంటర్లు క్లోజ్‌.. మెట్రోలో డిజిటల్‌ టికెట్లే..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 11:03 AM