జేఎన్‌టీయూలో మహామాయలు!
ABN , Publish Date - Jul 07 , 2026 | 10:19 AM
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు.
6 వేల సర్టిఫికెట్లు మాయం
విచారణ నివేదికపై గోప్యత
చక్రంతిప్పిన కీలక అధికారిపై చర్యలు శూన్యం
చాంతాడంత పాపాల చిట్టా ఉన్నా ఉన్నత పదవులు
వైసీపీ ముద్ర ఉన్నా కూటమి ప్రభుత్వం పెద్దపీట
అనంతపురం: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు. వర్సిటీలో చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అందజేయాల్సిన సర్టిఫికెట్లు మాయమయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 వేల సర్టిఫికెట్లు మాయమయ్యాయి. కాదు.. కాదు.. మాయంచేశారు. ఎక్కడికెళ్లాయో తెలియదు. ఎవరు చేశారో వర్సిటీలో అందరికీ తెలిసినా.. చర్యల్లేవు. ఒక్కో సర్టిఫికెట్‌ను మార్కెట్‌లో పెట్టి లక్షల రూపాయలకు విక్రయించారని వర్సిటీలో కోడై కూస్తున్నారు. అయినా చర్యల్లేవు.
ఇంతస్థాయిలో బరితెగించి అక్రమాలకు పాల్పడినా పట్టించుకోరెందుకో? విచారణ కమిటీ అన్నారు. ఆ తర్వాత ఆ ఊసే మరిచారు. కమిటీ విచారణ చేసింది నిజం.. ఏం తేల్చిందో గోప్యం. నివేదికను కాకులెత్తుకెళ్లాయో.. ఏమో.. మరి. ఏళ్లు గడుస్తున్నా చర్యల్లేవు. వర్సిటీలో సర్టిఫికెట్ల మిస్సింగ్‌తోపాటు భారీ అక్రమాలకు కేంద్ర బిందువైన అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఉన్నత పదవులు కట్టబెట్టడం శోచనీయం. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలా పనిచేసిన ఆ అధికారికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడం మరీ విచిత్రం. వర్సిటీల్లో ప్రక్షాళన చేపట్టిన కూటమి ప్రభుత్వానికి జేఎన్‌టీయూ అవినీతి తిమింగళం కనిపించకపోవడం మహా విచిత్రం.
జేఎన్‌టీయూలో పరీక్షల విభాగం కీలకం. వర్సిటీ పరిధిలో చదివిన విద్యార్థుల భవితవ్యం ఆ విభాగంపైనే ఆధారపడి ఉంటుంది. విద్యార్థి పాస్... ఫెయిల్ నిర్ణయించేది ఆ విభాగంలోని అధికారులే. అలాంటి కీలక విభాగంలో రూ.లక్షలు, రూ.కోట్లలో అవినీతి జరుగుతోందనడంలో సందేహం లేదు. ఇందుకు గతంలో ఆ విభాగంలో జరిగిన భారీ అక్రమాలే నిదర్శనం. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అందించే ఓడీ, ప్రొవిజనల్ సర్టిఫికెట్ల గోల్‌మాల్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఈ వ్యవహారం వర్సిటీని కుదిపేసింది. అయినా సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సర్టిఫికెట్ల మిస్సింగ్‌పై గతేడాది అధికారులు విచారణకు ఆదేశించారు. అది ఏమైందో... ఏం బయటపడిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అక్రమాల్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఉన్నత పదవిలో ఉండటంతోనే... వర్సిటీ అధికారులు చర్యలకు వెనకాడుతున్నట్లు సమాచారం.
6 వేల సర్టిఫికెట్ల మిస్సింగ్
2016లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సర్టిఫికెట్లు హైటెక్ ప్రింటర్స్ సరఫరా చేసింది. జేఎన్‌టీయూకి 10 వేలకుపైగా ఓడీ, ప్రొవిజనల్స్ ఖాళీ సర్టిఫికెట్లు వచ్చాయి. అవి పరీక్షల విభాగానికి వచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది. అప్పుడు వాటిని ఏయే అధికారులు తీసుకున్నారు, సర్టిఫికెట్లకు చెల్లించిన నగదు అన్ని అంశాలు అందులో పొందుపరిచారు. ఇందులో 4 వేలు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, 2 వేలు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు కనబడకుండాపోయాయి. ఓడీ సర్టిఫికెట్లకు సంబంధించి (సీసీ021001 నుంచి సీసీ025000) వరకూ, ప్రొవిజినల్ (పీసీ0248001 నుంచి పీసీ025000) వర కూ సర్టిఫికెట్లు మిస్ అయ్యాయి.
వచ్చిన సర్టిఫికెట్లల్లో దాదాపు 6వేల సర్టిఫికెట్లు కనబడకుండా పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాఖ ఆడిట్ చేసిన సమయంలో మిస్సింగ్ అయిన సర్టిఫికెట్లకు సంబం ధించి నగదు చెల్లించారా..? ఎక్కడికెళ్లాయని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ మేరకు నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల మిస్సింగ్ వెనుక ఆ కీలక అధికారి చక్రం తిప్పినట్లు అప్పట్లో విమర్శలు పెద్దఎత్తున వినిపించాయి.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.వేలల్లో ధరలు నిర్ణయించి బయట మార్కెట్లో అమ్ముకున్నట్లు సమాచారం. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కీలక అధికారి అవినీతికి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. అప్పటి వైసీపీ ప్రభుత్వం అండతో అంచెలంచెలుగా కీలక ప దవులను అలంకరించారు. ఆర్థికపరమైన అం శాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించడంతోపాటు... రూ.కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలు లేకపోలేదు.
నివేదిక ఏమైంది..?
కూటమి అధికారంలోకి వచ్చాక వర్సిటీల్లో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించిన విషయం విదితమే. అందులో భాగంగానే జేఎన్‌టీయూలో సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. దీంతో గతేడాది వర్సిటీ అధికారులు ఓ కమిటీని నియమించి విచారణకు ఆదేశించారు. 6 వేల సర్టిఫికెట్ల మిస్ అయినట్లు అధికారులు నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఏమైందో... ఎవరికి అందించారో... ఆ కీలక అధికారిపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ అంతు చిక్కడంలేదు.
కూటమి ప్రభుత్వంలోనూ పెద్దపీట
జేఎన్‌టీయూలో దశాబ్దానికిపైగా అవినీతి కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ అధికారిపై చర్యలు తీసుకోవడం దేవుడెరుగు... ఒక్కో అక్రమం బయటపడినప్పుడల్లా ఉన్నత పదవులు వరిస్తుండటం విస్తుపోయే అంశమనే చెప్పాలి. పరీక్షల విభాగంలో అవినీతికి పాల్పడితే వైసీపీ అధికారంలోకి రాగానే కీలక పదవి దక్కింది. అక్కడ ఆర్థికపరమైన అంశాల్లో రూ.కోట్లు కమీషన్లు దండుకుంటే చర్యలు లేవు. కూటమి అధికారం చేపట్టాక మరో కీలక పదవిలో కూర్చోబెట్టారు. వైసీపీ హయాంలో కార్యకర్తల్లా వ్యవహరించిన అధికారులపై కొరడా ఝుళిపిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ కీలక అధికారి విషయంలో మాత్రం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉన్నత పదవిలో కూర్చోబెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈసీ మీటింగ్‌లో పెట్టాల్సి ఉంది..
పరీక్షల విభాగంలో సర్టిఫికెట్ల మిస్సింగ్‌పై అంతర్గత విచారణకు ఆదేశించిన విషయం వాస్తవమే. ఆ కమిటీ అందించిన నివేదికను ఈసీ మీటింగ్‌లో పెట్టాల్సి ఉంది. కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.
సుదర్శనరావ్, జేఎన్‌టీయూ వీసీ
ఈ వార్తలు కూడా చదవండి:
నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు
తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News