నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:22 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం రొనాల్డో మీడియాతో మాట్లాడాడు. పోర్చుగల్ జట్టుకు తాను అందించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌పై 1-0 తేడాతో పోర్చుగల్ ఓటమిపాలైంది. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. ఇదే తన కెరీర్‌లో చివరి ప్రపంచ కప్ అని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో తన వరల్డ్ కప్ కెరీర్‌ను ఓటమితో ముగించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం రొనాల్డో మీడియాతో మాట్లాడాడు. పోర్చుగల్ జట్టుకు తాను అందించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించడం బాధగా ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. నా వంతు కృషి చేశాననే సంతృప్తితోనే ఉన్నాను. ఇది నా చివరి ప్రపంచ కప్ అన్నది వాస్తవం. కానీ ఇప్పుడే రిటైర్‌మెంట్ ఇచ్చేసే ఆలోచన లేదు. ఇక నా కుటుంబంతో కొంత సమయం గడిపి.. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. భావోద్వేగంలో తొందరపడి ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోను’ అని రొనాల్డో వెల్లడించాడు.
ఒక్క టైటిల్ లేదు..
ఈ సందర్భంగా రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌ను గుర్తు చేసుకున్నాడు. పోర్చుగల్‌కు మూడు ప్రధాన ట్రోఫీలు అందించడంలో తాను కీలక పాత్ర పోషించానని పేర్కొన్నాడు. ‘క్రిస్టియానో రొనాల్డోకు ముందు పోర్చుగల్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. నా కెరీర్‌లో దేశానికి మూడు టైటిళ్లు అందించా. 2016లో గెలిచిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ నాకు వరల్డ్ కప్‌తో సమానమైన గొప్ప విజయంగా భావిస్తాను. అలాగే రెండు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లు కూడా మా దేశ ఫుట్‌బాల్ చరిత్రలో ప్రత్యేకమైనవే’ అని రొనాల్డో చెప్పాడు.
కోచ్ మార్టినెజ్‌పై ప్రశంసలు
వరల్డ్ కప్ నుంచి నిష్క్రమణ అనంతరం పోర్చుగల్ ప్రధాన కోచ్ రోబర్టో మార్టినెజ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఆయన సేవలను కొనియాడాడు. ‘ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయన గొప్ప కోచ్ మాత్రమే కాదు.. అద్భుతమైన వ్యక్తి కూడా. పోర్చుగల్ ఫుట్‌బాల్ కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఎప్పుడూ బాధాకరమే. మా జట్టు మంచి ఫుట్‌బాల్ ఆడింది. ఫలితం ఏవైపు అయినా వెళ్లే మ్యాచ్ అది. కానీ ఫుట్‌బాల్‌లో ఇలాంటి ఫలితాలు సహజం. ఇప్పుడు ఈ నిరాశను అధిగమించి ముందుకు సాగాల్సిందే’ అని రొనాల్డో వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు