ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:15 PM
ఫిఫా ప్రపంచకప్2026లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఫుడ్‌బాల్ ఆటగాడు ఫొలారిన్ బలోగన్ రెడ్ కార్డ్ వివాదం, ఆపై ఫిఫా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్2026లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఫుడ్‌బాల్ ఆటగాడు ఫొలారిన్ బలోగన్ రెడ్ కార్డ్ వివాదం, ఆపై ఫిఫా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బోస్నియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు ఫొలారిన్ బలోగన్‌కు రిఫరీ నేరుగా రెడ్ కార్డ్ చూపించాడు. నిబంధనల ప్రకారం, రెడ్ కార్డ్ పొందిన ఆటగాడు తదుపరి ఒక మ్యాచ్‌కు దూరంగా ఉండాలి. దీనివల్ల బెల్జియంతో జరగాల్సిన కీలకమైన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కి బలోగన్ అందుబాటులో ఉండడు.
అయితే, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారని సమాచారం. ఆ వెంటనే, ఫిఫా తన క్రమశిక్షణ కమిటీ నిబంధనలలోని 'ఆర్టికల్ 27'ని ఉపయోగించి, బలోగన్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో బలోగన్ బెల్జియంతో మ్యాచ్ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (UEFA) తీవ్రంగా మండిపడింది.
'ఫిఫా ఒక 'రెడ్ లైన్'ను దాటింది. ఆట నియమాలను పక్కనపెట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం క్రీడ సమగ్రతను దెబ్బతీస్తుంది' అని యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం ఘాటుగా విమర్శించింది. ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఆటపై నమ్మకాన్ని పోగొడతాయని, ఇది ఫెయిర్ ప్లే సూత్రాలకు విరుద్ధమని యూఈఎఫ్ఏ హెచ్చరించింది. మాజీ ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కూడా ఈ చర్యను తప్పుబడుతూ.. ఫుట్‌బాల్‌ను రాజకీయ క్రీడా ప్రాంగణంగా మార్చకూడదని వ్యాఖ్యానించారు. ఫిఫా నిర్ణయంపై బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య కూడా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై తదుపరి చర్యల కోసం పరిశీలిస్తోంది. ప్రపంచకప్ లాంటి వేదికపై ఇలాంటి రాజకీయ జోక్యం జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసీస్ నిలకడే ఆ జట్టును విజేతగా నిలిపింది: సచిన్
చరిత్ర సృష్టించిన డాసున్ శనక: 4 బంతుల్లో 4 వికెట్లు..