Share News

ఆసీస్ నిలకడే ఆ జట్టును విజేతగా నిలిపింది: సచిన్

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:51 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

ఆసీస్  నిలకడే ఆ జట్టును విజేతగా నిలిపింది: సచిన్
Australia Women World Cup 2026

స్పోర్ట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, రికార్డు స్థాయిలో 7వ సారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆసీస్ మహిళల జట్టు ఓటమి ఎరుగకుండా అజేయంగా సాగడం విశేషం.


ఆస్ట్రేలియా అద్భుత విజయాలపై భారత క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. 'మరో ప్రపంచకప్ టైటిల్ సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. టోర్నీలో వారి జైత్రయాత్ర.. వారు విభిన్న పరిస్థితులను ఎంత చక్కగా అధిగమించారో, ఎంత నిలకడగా రాణించారో చెప్తోంది. ఇలాంటి స్థిరత్వమే ట్రోఫీలను తెచ్చిపెడుతుంది. ఆసీస్ నిలకడే.. ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపింది' అంటూ సచిన్ ప్రశంసించారు.


ఆసీస్ అజేయ యాత్ర..

ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 151 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ బెత్ మూనీ (64 పరుగులు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అంతటా ఆస్ట్రేలియా జట్టు చూపించిన నిలకడ, ఒత్తిడిని అధిగమించిన తీరు వారిని ఛాంపియన్లుగా నిలబెట్టాయి. దీంతో ఆస్ట్రేలియా మహిళల జట్టుపై సచిన్‌తో సహా పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన డాసున్ శనక: 4 బంతుల్లో 4 వికెట్లు..

ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు తీవ్ర గాయం.. ఆస్పత్రికి తరలింపు

Updated Date - Jul 06 , 2026 | 04:02 PM