హర్యానాలో దారుణ ఘటన.. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి..
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:54 PM
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి తుపాకితో కాల్చి చంపేశాడు. పెళ్లైన మూడు నెలలకే భార్యపై ఈ దారుణానికి పూనుకున్నాడు.
గురుగ్రామ్, జులై 6: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి తుపాకితో కాల్చి చంపేశాడు. పెళ్లైన మూడు నెలలకే భార్యపై ఈ దారుణానికి పూనుకున్నాడు. హత్య అనంతరం భర్త తన ప్రియురాలితో కలిసి నేపాల్ పారిపోయాడు. నెల రోజుల తర్వాత నిందితులిద్దరూ ఇండియాకు తిరిగి రావటంతో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గురుగ్రామ్‌లోని మనేశ్వర్‌కు చెందిన 25 ఏళ్ల అంకిత్ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం ఝజ్జర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల రజనీ దేవీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే, అంకిత్.. రజనీని కాకుండా మధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గత ఫిబ్రవరి నెలలో మధు, అంకిత్‌ల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా అంకిత్ తన ప్రియురాలితో సంబంధాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే అంకిత్, రజనీ కలిసి మధును చంపాలని నిశ్చయించుకున్నారు. మే 21వ తేదీన అంకిత్ తన భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లాడు. అక్కడ మధును తుపాకితో కాల్చి చంపాడు. మధు చనిపోయిందని ధ్రువీకరించుకున్న తర్వాత అంకిత్, రజనీ దేవీ హరిద్వార్ పారిపోయారు.
అక్కడినుంచి నేపాల్ వెళ్లిపోయారు. మధు ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె తల్లి మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజున పోలీసులు రజనీ దేవీ గది దగ్గరకు వెళ్లారు. గదిలో మధు శవాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగించారు. అంకిత్, రజనీలు జూన్ 30వ తేదీన ఇండియాలోకి రాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. పోలీసులు నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
ఇవి కూడా చదవండి
ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు తీవ్ర గాయం.. ఆస్పత్రికి తరలింపు
ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..