ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు తీవ్ర గాయం.. ఆస్పత్రికి తరలింపు
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:50 PM
మెక్సికోపై సంచలనం విజయం సాధించి ఆనందంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సీనియర్ మిడ్ ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ గెలుపు సంబరాల్లో అనూహ్యంగా గాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సహ ఆతిథ్య దేశం మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పది మందితోనే ఆడిన ఇంగ్లండ్.. మెక్సికోను 3-2 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఆనందంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సీనియర్ మిడ్ ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ గెలుపు సంబరాల్లో అనూహ్యంగా గాయపడ్డాడు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మెక్సికోపై సంచలన విజయం అనంతరం ఇంగ్లండ్ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో హెండర్సన్ కూడా అభిమానులతో విజయానందాన్ని పంచుకుని ప్రకటనల బోర్డు పై నుంచి దాటుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం నుంచే స్ట్రెచర్‌పై అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ థామస్ టూచెల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘జోర్డాన్ హెండర్సన్ ప్రమాదవశాత్తు పడిపోవడంతో మణికట్టుకు తీవ్ర గాయమైంది. అతడి పరిస్థితి అంత బాగాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతటి సంతోషకర సమయంలో అతడు మాతో లేకపోవడం బాధాకరం’ అని టూచెల్ వెల్లడిచారు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: ట్రంప్ జోక్యం.. యూఎస్ ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేత!
వింబుల్డన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్దలు